ఖమ్మం వైద్యవిభాగం: రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు సత్వర వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా అమలు చేస్తున్న పీఎం రాహత్ పథకం కింద ఆరోగ్యశ్రీ జాబితాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు నమోదు చేయించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో పీఎం రాహత్ పథకం లక్ష్యాలు, అమలు విధానం, ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వివరించారు. ఆతర్వాత కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం కింద ఎంప్యానెల్ అయిన ఆస్పత్రులను పీఎం రాహత్ పథకంలో చేర్చేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే శనివారం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు బాధ్యులు అవసరమైన పత్రాలతో కలెక్టరేట్‌కు రావాలని సూచించారు. వచ్చే సోమవారం నాటికి ప్రతీ ఆస్పత్రి రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కాగా, ఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు 7 రోజుల వరకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించొచ్చని చెప్పారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే 112 అత్యవసర సేవలకు ఫోన్ చేయాలనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అన్ని 108 అంబులెన్సులకు ట్రాకింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ పరాస్ కుమార్, ఏసీపీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలే సాగు చేయండి
ఖమ్మం రూరల్: ఎల్‌నినో ప్రభావంతో వర్షభావ పరిస్థితులు నెలకొన్నందున రైతులు యాసంగిలో అధిక నీరు అవసరమయ్యే వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. మండలంలోని చింతపల్లిలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలు తగ్గడం, వచ్చే ఏడాది ఆగస్టు వరకు వర్షాలు తక్కువగా కురుస్తాయనే సూచనలతో కూరగాయలు, చిరుధాన్యాలు వంటి తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలన్నారు. పశువుల దాణా సమస్య తలెత్తకుండా ఉచిత పశుగ్రాస విత్తనాల కిట్లు అందిస్తుండగా, ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకు రూ.308 కూలీతో ఎక్కువ పనిదినాలు కల్పించనున్నట్లు చెప్పారు. కాగా, ఏటా చింతపల్లికి వసల వచ్చే నైజీరియా కొంగలు సంరక్షణ కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ అమలుచేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, ఎమ్మెల్సీ ఎన్నికలకు పట్టభద్రుల ఓట్ల నమోదుపై సూచనలు చేశారు.
అభివృద్ధి పనుల్లో వేగం
పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. మద్దులపల్లిలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. బాలుర, బాలికల హాస్టళ్ల భవనాలు, ప్రధాన భవనం, అకడమిక్ బ్లాక్ నిర్మాణాలపై ఆరా తీసిన ఆయన నాణ్యతతో వేగంగా జరిగేలా చూడాలని తెలిపారు. ఆతర్వాత కలెక్టర్ వెంకటగిరిలో అసంపూర్తిగా ఉన్న జీ పస్ల్ 2 భవనాలను పరిశీలించి ప్రజలకు ఉపయోగపడేలా చేయాల్సిన పనులపై ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు డి.పుల్లయ్య, ఎం.వీ.మధుసూదన్, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ హరినాథ్‌బాబు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఏ.శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు రాజేష్, వినయేందర్‌రెడ్డి, రవికుమార్, సురేష్, మహేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర టీ.ఎస్.


