నేలకొండపల్లి: ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి మూడు కోడిగుడ్ల చొప్పున అందిస్తున్నామని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి కె.రవిబాబు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీని గురువారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా జిల్లాలోని 21 కాలేజీల్లో గుడ్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మారిన సిలబస్ విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని అధ్యాపకులకు సూచించారు.
వంట గది ఇలానే ఉంటుందా?
మండలంలోని కోరట్లగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మండల ప్రత్యేక అధికారి అయిన డీఐఈఓ తనిఖీ చేయగా, మెనూ అమలులో మార్పులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, వంట గది అపరిశుభ్రంగా ఉండడంతో ‘సొంతిళ్లు అయితే ఇలాగే వదిలేస్తారా, కరెంట్ లేకున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు’ అని ప్రశ్నించారు. అంతేకాక విద్యార్థులకు ఒకే జత యూనిఫాం అందిందని తెలియడంతో ఐకేపీ ఏపీఎంను ఫోన్ చేసి సూచనలు చేశారు. ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంఈఓ తదితరులు పాల్గొనగా పాఠశాల ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ నాయకుడు బచ్చలకూరి నాగరాజు కోరారు.


