గుజరాత్ రాష్ట్రంలోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ నిపుణులు రంగంలోకి దిగాక రామారావు హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. గతంలో సేకరించిన ఆధారాలకు తోడు నిపుణుల విచారణతో బయటపడిన అంశాల ఆధారంగా ఖమ్మం రూరల్ తెల్దారుపల్లికి చెందిన బోడపట్ల శ్రీనివాసరావు అలియాస్ మెంటల్ శ్రీను, నూకల లింగయ్య, మల్లారపు లక్ష్మయ్య, కార్లపూడి ఉదయ్‌కుమార్ అలియాస్ రుక్మాన్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. వీరిలో ఉదయ్ కాక మిగతా ముగ్గురు గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ నాయకుడు, ఖమ్మంరూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన తమ్మినేని కృష్ణయ్య హత్య కేసుతో పాటు చౌటపల్లిలో జరిగిన హత్య కేసులోనూ నిందితులు. అయితే, హత్యకు దారి తీసిన పరిస్థితులు, ఎవరు ప్రేరేపించారనే అంశాలపై విచారణ జరుగుతోందని, మిగతా నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసు కమిషనర్ వివరించారు. కాగా, నిందితులను గురువారం ఉదయం చింతకాని పోలీసుస్టేషన్‌కు తీసుకురాగా.. ఆతర్వాత సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం మత్కేపల్లి పరిధి తుమ్మలమ్మ చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లారు. ఆపై ఖమ్మం తరలించగా సీపీ వివరాలు వెల్లడించారు. రామారావు హత్య కేసులో సమగ్ర పర్యవేక్షణ అధికారిగా వైరా ఏసీపీ సారంగపాణి, వైరా సీఐ వెంకటప్రసాద్, మధిర రూరల్ సీఐ రమేష్, ఎస్సైలు వీరేందర్, నరేష్ పనిచేయగా వీరిని సీపీ అభినందించి రివార్డులు అందజేశారు.


