ఈదురు గాలులు..
వర్షంతో పెరిగిన చలి తీవ్రత
పలు చోట్ల నీరు గారుతున్న పత్తి,
వరి, మిర్చి చేలల్లోకి చేరిన నీరు
జిల్లాలో 1.2 సెం.మీ. వర్షపాతం నమోదు
ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మొదలైన అర్నబ్ తుపాన్ జిల్లాపై ప్రభావం చూపుతోంది. తుపాన్ తీవ్రత జిల్లాపై
మంగళ, బుధ, గురువారం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే
మంగళవారం వాతావరణం మేఘావృతం కాగా రాత్రి నుంచి వర్షం మొదలైంది.
బుధవారం ఉదయం నుంచి ముసురుతో కూడిన వర్షం రోజంతా కురిసింది. జిల్లాలో బుధవారం 1.2 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీస్తున్నాయి. గురువారం సైతం
జిల్లావ్యాప్తంగా వర్షం కురిసే అవకాశముంది.
– సాక్షి ప్రతినిధి, ఖమ్మం
ఎడతెరిపి లేకుండా..
జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. అల్పపీడనం కారణంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. ఇన్నాళ్లు ఉక్కపోత ఉండగా.. మంగళ, బుధవారాల్లో చలితీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గురువారంతో పాటు రానున్న మూడు, నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
పంటలకు ఊపిరి
కోత దశకు చేరుకుని, నీటి తడులు అవసరమైన పంటలకు ఈ వర్షం వరంలా మారింది. ఇప్పటి వరకు వర్షాలు లేక ఎండిపోతున్న పంటలకు మేలు చేసినట్లయింది. జిల్లాలో పత్తి కాకుండా 3,37,100 ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యాయి. అందులో 2,92,915 ఎకరాల్లో వరి సాగైంది. సీజన్‌లో వర్షాలు లేక పంటల దిగుబడి అంతంత మాత్రంగానే నమోదవుతోంది. చివరి దశలో ఉన్న పంటలకు ఈ వర్షం ఉపయోగం కాగా, భారీ వర్షం నమోదైతే మాత్రం పంట చేతికి వస్తుందా, రాదా అన్న ఆందోళన కూడా రైతులు వెంటాడుతోంది.
నేలవాలిన వరి.. దెబ్బతిన్న పత్తి
గత రెండు వారాల నుంచి జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. కోత దశలో ఉన్న వరికి ఈ వర్షం ఉపయోగంగా మారనుంది. అయితే, ఈదురు గాలులు వీచిన చోట వరి చేలు నేలవాలాయి. ఇదే సమయాన వాతావరణ శాఖ సూచించినట్లు భారీ నుంచి అతిభారీ వర్షాలు లేకపోవడంతో పంటలకు అధిక నష్టం వాటిల్లలేదు. కానీ ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటే కోత దశకు వచ్చిన వరి ధాన్యం నేలరాలుతుందని వాపోతున్నారు. మరోపక్క తుపాన్‌తో వరి, మిర్చి పంటలకు కొంత మేలు జరిగినా, పత్తిపంట మాత్రం దెబ్బతిన్నది. జిల్లాలో 2,16,229 ఎకరాల్లో పత్తి సాగైంది. ఇప్పటికే రెండు తీతలు పూర్తవగా మార్కెట్‌కు అమ్మకానికి కూడా తీసుకొస్తున్నారు. ఈ దశలో వర్షం కురవడంతో చేలలో ఉన్న పత్తి తడిసిపోతోంది. పత్తి కుళ్లిపోవడం, రంగు మారి, నాణ్యత దెబ్బతింటే ధర పడిపోయే ప్రమాదముంది. తిరుమలాయపాలెం, కొణిజర్ల, వైరా, ఏన్కూరు, కామేపల్లి, కారేపల్లి మండలాల్లో పత్తి పూర్తిగా తడిసిపోగా.. తల్లాడలో తీతకు సిద్ధంగా ఉన్న పత్తి తడిసింది.
అర్నబ్ ప్రభావంతో
జిల్లా అంతటా వర్షం
ఉమ్మడి జిల్లాలో అర్నబ్ తుపాన్ ప్రభావంపై రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరా తీశారు. రెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఈదురుగాలుల నేపథ్యంలో ఇబ్బందులు, నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టర్ దివాకర టీ.ఎస్., భద్రాద్రి కలెక్టర్ అంకిత్‌తో బుధవారం ఫోన్‌లో మంత్రి మాట్లాడి వాతావరణ పరిస్థితులు తెలుసుకున్నారు. తుపాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


