పండుగ సీజన్‌లో 41.72 లక్షల మంది ప్రయాణం
ఖమ్మం మయూరిసెంటర్: దసరా పండుగ వేళ ఆర్టీసీకి కాసుల వర్షం కురిసింది. ప్రయాణికులకు ఇబ్బంది ఎదురుకాకుండా డిపోల వారీగా అధికారులు సమన్వయంతో ప్రత్యేక సర్వీసులు ఏర్పాటుచేయడంతో ఖమ్మం రీజియన్‌కు భారీ ఆదాయం సమకూరింది.
వెల్లువలా ప్రయాణికులు
దసరా సందర్భంగా ఆర్టీసీ అధికారులు ఈనెల 9 నుంచి 26వ తేదీ వరకు రోజువారీ సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు నడిపించారు. ఇందులో ప్రధానంగా 9నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు పెద్ద ఎత్తున వచ్చిన ప్రయాణికులతో బస్సులు కిటకిటలాడాయి. పండుగకు ముందు 25,63,352 మంది ప్రయాణించగా, పండుగ ముగిశాక ఈనెల 20 నుంచి 26వరకు ఉమ్మడి జిల్లా నుంచి హైదరాబాద్‌కు 16,08,917 మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. మొత్తంగా పండుగ సీజన్‌లో 41,72,269 మంది బస్సుల్లో రాకపోకలు సాగించారు.
52,02,135 కి.మీ. ప్రయాణం
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈనెల 9 నుంచి 19 వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 927 అదనపు సర్వీసులతో కలిపి 7,283 బస్సులు నడిపించారు. ఇవన్నీ 31,98,724 కిలోమీటర్ల మేర తిరగగా రూ.17,13,48,498 ఆదాయం సమకూరింది. ఇక తిరుగు ప్రయాణంలో 460 అదనపు సర్వీసులతో కలిపి మొత్తం 4,466 సర్వీసులను ఆపరేట్ చేశారు. ఈక్రమాన 20,03,411 కి.మీ. తిరిగిన ఈ బస్సుల ద్వారా రూ.11,38,44,582 ఆదాయం వచ్చింది. మొత్తంగా పండుగ వేళ 1,387 అదనపు సర్వీసులతో కలిపి మొత్తం 11,749 బస్సులు నడిపించామని రీజినల్ మేనేజర్ సరిరామ్ వెల్లడించారు. ఈ సర్వీసులు 52,02,135 కిలోమీటర్లు ప్రయాణించగా, సంస్థకు రికార్డు స్థాయిలో రూ.28,51,93,080 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. కాగా, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అంకితభావంతో విధులు నిర్వర్తించిన డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్‌ఎం అభినందనలు తెలిపారు.
దసరా సర్వీసులతో రూ.28.51 కోట్ల ఆదాయం


