కాదనుకుని వదిలేశారు.. | - | Sakshi
Sakshi News home page

కాదనుకుని వదిలేశారు..

Oct 29 2026 12:18 AM | Updated on Oct 29 2026 12:18 AM

● బురదలో నవజాత శిశువు ● ఆస్పత్రికి చేర్చిన స్థానికులు, ఆశా కార్యకర్త

● బురదలో నవజాత శిశువు ● ఆస్పత్రికి చేర్చిన స్థానికులు, ఆశా కార్యకర్త

రఘునాథపాలెం: కన్ను తెరవడమే ఆలస్యం.. ఆ పసికందుకు కష్టాలు మొదలయ్యాయి. అప్పుడే జన్మించిన మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు బొప్పాయి తోటలోని బురదలో వదిలివెళ్లిన ఘటన రఘునాథపాలెం మండలంలోని వీఆర్‌ బంజర సమీపాన బుధవారం వెలుగుచూసింది. ఉదయం 6 గంటల సమయాన వాటర్‌ ట్యాంక్‌ పక్కన తోటలో శిశువును గుర్తించిన స్థానికులు సర్పంచ్‌ రమణకు సమాచారం అందించగా, ఆయన తన కారులో ఆశా కార్యకర్త రమాదేవి ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

స్పందించిన అధికారులు

శిశువును ఆస్పత్రిలో చేర్చారనే సమాచారంతో జిల్లా బాలల పరిరక్షణ అధికారి విష్ణువందన, జిల్లా మహిళా సంక్షేమ అధికారి ప్రమీల, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పర్వీన్‌ చికిత్సపై వైద్యులతో చర్చించారు. శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండగా, బుధవారం తెల్లవారుజామున 2గంటల సమయాన జన్మించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈమేరకు రఘునాథపాలెం సీఐ టి.కరుణాకర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి శిశువును ఎవరు వదిలివెళ్లారో గుర్తించేందుకు విచారణ చేపట్టారు. గ్రామ పరిధిలో నెలలు నిండిన గర్భిణుల వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. కాగా, ఏ కారణం చేతనైనా పిల్లలను పెంచలేని పరిస్థితి ఎదురైతే తమకు అప్పగించాలే తప్ప వదిలేయొద్దని జిల్లా బాలల పరిరక్షణ అధికారి విష్ణువందన కోరారు. తద్వారా పిల్లలను సంరక్షిస్తూ అవసరమైన దంపతులకు చట్టప్రకారం దత్తత ఇస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement