● అమెరికా నుంచి ఖమ్మం చేరిన అక్షిత మృతదేహం ● మిన్నంటిన తల్లిదండ్రులు, బంధువుల రోదనలు
ఖమ్మంఅర్బన్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నల్లమల అక్షిత గుండెపోటుతో మృతి చెందగా, ఐదు రోజుల అనంతరం ఆమె మృతదేహం ఖమ్మం చేరుకుంది. ఈనెల 23న అమెరికాలోని న్యూయార్క్‌లో మృతిచెందిన అక్షిత మృతదేహాన్ని తీసుకుని ఆమె సోదరుడు అక్షయ్ మంగళవారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్, నాయకులు రావూరి సైదబాబు, చండ్రా రాంబాబు ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని ఖమ్మంలోని మమతా రోడ్డులోని అక్షిత నివాసానికి బుధవారం ఉదయం తీసుకొచ్చారు.
తల్లిదండ్రులకు గుండెకోత..
కళ్లముందు ఆడుతూ పాడుతూ పెరిగిన కూతురు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమవుతున్న క్రమాన కన్నుమూసి విగతజీవిగా ఇంటికి చేరడంతో అక్షిత తల్లిదండ్రులు నల్లమల ఆనంద్ – కల్పనతో పాటు కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. అక్షిత మృతదేహంపై పడి తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటగా, బల్లెపల్లి శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. సుడా, మార్కెట్ చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, యరగర్ల హన్మంతరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, వివిధ పార్టీల నాయకులు నున్నా నాగేశ్వరరావు, బాగం హేమంతరావు, సంక్రాంతి నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు అక్షిత మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు.


