అంగన్‌వాడీ కేంద్రంలో
విషపురుగు కాటు ?
చికిత్స పొందుతూ ఐదేళ్ల చిన్నారి మృతి
మృతదేహంతో ఆందోళన.. న్యాయం చేస్తామని అధికారుల హామీ
ఖమ్మంఅర్బన్: మొన్నటి ఆదివారం రాత్రి పక్కింట్లో పుట్టినరోజు వేడుకలు.. ఆ వేడుకకు హాజరైన చిన్నారి బెలూన్లను చూసి మురిసిపోయింది. మరుసటి రోజు చిన్నారిని బెలూన్ల మధ్య నిలబెట్టి తల్లిదండ్రులు ఫొటోలు తీయగా.. అవే చివరి జ్ఞాపకాలుగా మిగులుతాయని ఊహించలేదు. అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన చిన్నారి ధన్యశ్రీ(5) విషపురుగు కాటు బారిన పడడంతో చికిత్స పొందుతూ మృతి చెందగా కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు...
అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఆస్పత్రికి...
ఖమ్మం ఏడో డివిజన్ టేకులపల్లికి చెందిన అయ్యదేవర రవి – స్వప్న దంపతుల పెద్ద కుమార్తె ధన్యశ్రీ స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతోంది. దసరా సెలవుల అనంతరం సోమవారం ఉదయం కేంద్రానికి వెళ్లగా, కాసేపటికి ఆరోగ్యం బాగాలేదని సిబ్బంది సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయాన తల్లిదండ్రులు వెళ్లగా ముఖ మంతా దద్దుర్లు, ఒంటిపై వాపు రావడంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. అయితే, హైదరాబాద్ చేరుకునేలోగా ధన్యశ్రీ మృతి చెందింది. విషపు పురుగు కుట్టడంతోనే ఈ పరిస్థితి వచ్చి ఉండొచ్చని వైద్యులు చెప్పినట్లు తల్లిదండ్రులు వాపోయారు. కాగా, చింతకాని మండలం కొదుమూరు నుంచి పొట్టకూటి కోసం ఏడేళ్ల క్రితం రవి దంపతులు ఖమ్మం వలస వచ్చారు. రవి హమాలీగా, స్వప్న కూలీ పనులతో జీవనం సాగిస్తున్నారు.
మృతదేహంతో ఆందోళన..
చిన్నారి మృతదేహంతో మంగళవారం ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అంగన్‌వాడీ కేంద్రం పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని ఆరోపించారు. తొలుత అంగన్‌వాడీ కేంద్రం వద్ద, ఆతర్వాత ఖమ్మం–వైరా ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. రెండు గంటలకు పైగా నిరసన కొనసాగడంతో డీడబ్ల్యూఓ ప్రమీల విషయాన్ని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన చేరుకుని కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, ఔట్‌సోర్సింగ్ విధానంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఏసీపీ రమణమూర్తి, సీఐలు రామకృష్ణ, నాగరాజు ఆధ్వర్యాన బందోబస్తు నిర్వహించారు. కాగా, రహదారిపై ఆందోళన నిర్వహించిన 30మందిపై ఖమ్మం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా, చిన్నారి ధన్యశ్రీ మృతిపై ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఖమ్మం అర్బన్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.


