పాల్వంచ: అతివేగంతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లగేజ్ డోర్ తెరుచుకోగా, అది పక్కనే మోటార్ సైకిల్‌పై వెళ్తున్న సింగరేణి ఉద్యోగికి తాకడంతో తీవ్రగాయాల పాలై మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు... సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన రెడ్డి సతీష్‌రెడ్డి(40) తన కుటుంబంతో కలిసి పాల్వంచలోని నవభారత్ గాంధీనగర్‌లో ఉంటూ మణుగూరు సింగరేణి సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. మంగళవారం తెల్ల వారుజామున ఆయన టీ తాగేందుకు బైక్‌పై నవభారత్ సెంటర్‌కు వెళ్తున్నాడు. ఈ సమయాన కొత్తగూడెం వైపు నుంచి పాల్వంచ వైపు వస్తున్న బీఎస్‌ఆర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతివేగంతో ముందు ఉన్న యాష్ ట్యాంకర్‌ను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈక్రమాన బస్సు ఎడమ వైపు లగేజ్ బాక్స్ డోర్ ఒక్కసారి తెరుచుకుని పక్కనే వెళ్తున్న సతీష్‌రెడ్డికి తాకడంతో రోడ్డుపై పడిపోయాడు. ఆయన తల వెనకాల గాయమై తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిసి సతీష్‌రెడ్డి భార్య అనూష చేరుకుని మృతదేహం వద్ద విలపించిన తీరు స్థానికులను కలిచివేసింది. కాగా, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ కూసుమంచి మండలం చిన్న పోచారం గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ టి.నాగరాజు తెలిపారు. కాగా, సతీష్‌కు భార్యతో పాటు కూమార్తెలు అభీష్ట, భవిష్య ఉన్నారు.
పక్కనే వెళ్తున్న
సింగరేణి ఉద్యోగికి తాకడంతో మృతి


