విధుల్లో చేరిన మత్స్యశాఖ అఽధికారి మల్లేశం | - | Sakshi
Sakshi News home page

విధుల్లో చేరిన మత్స్యశాఖ అఽధికారి మల్లేశం

Oct 27 2026 12:32 AM | Updated on Oct 27 2026 12:32 AM

ఖమ్మంవ్యవసాయం: నెల రోజులుగా సెలవులో ఉన్న జిల్లా మత్స్యశాఖ అధికారి అరికోటి మల్లేశం సోమవారం విధుల్లో చేరారు. అనారోగ్య కారణాలతో ఆయన సెలవు పెట్టారు. అప్పటి నుంచి మహబూబాబాద్‌ జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయ స్వామి జిల్లా బాధ్యతలు అదనంగా నిర్వర్తిస్తున్నారు. ఈమేరకు సెలవు ముగియడంతో మల్లేశం తిరిగి విధుల్లో చేరారు.

చోరీకి యత్నిస్తూ

పట్టుబడిన నిందితుడు

తిరుమలాయపాలెం: మండలంలోని కాకరవాయిలో సోమవారం మధ్యాహ్నం ఓ ఇంటి తాళం పగులగొట్టి చోరీకి యత్నిస్తున్న వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామానికి చెందిన సలిగంటి లింగయ్య మెకానిక్‌ పనులు చేసేందుకు తాళం వేసి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం ఓ వ్యక్తి అక్కడకు వచ్చి తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. అదే సమయాన లింగయ్య రాగా, ఇంటి తలుపు గడియ పెట్టి స్థానికులు పిలిచి నిందితుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిది కామేపల్లి మండలమని తెలియగా, గతంలోనూ నేరచరిత్ర ఉందని తెలిసింది. ఈమేరకు పోలీసులు విచారణ అనంతరం వివరాలు వెల్లడించే అవకాశముంది.

బైక్‌పై స్టంట్లు చేస్తున్న మైనర్‌పై కేసు

ఖమ్మంక్రైం: ప్రధాన రహదారిపై బైక్‌తో స్టంట్లు చేస్తున్న మైనర్‌పై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ తెలిపారు. ఖమ్మం దివ్యాంగుల కాలనీలో 15 ఏళ్ల యువకుడు బైక్‌తో ప్రమాదకరంగా విన్యాసాలకు చేస్తున్నట్లు అందిన ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు వాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

కంప్రెషర్‌ ట్రాక్టర్‌, పేలుడు పదార్థాలు స్వాధీనం

తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం భవాని హోటల్‌ సమీపాన ఓ వెంచర్‌లో బండరాళ్లను అనుమతి లేకుండా బ్లాస్టింగ్‌ చేస్తున్న కంప్రెషర్‌ ట్రాక్టర్‌ను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం రమణగుట్టకు చెందిన ఆళ్లకుంట ఉపేందర్‌, ఆళ్లకుంట వెంకన్న బండరాళ్లకు బాంబులు పెట్టి కంప్రెషర్‌ ట్రాక్టర్‌ సాయంతో పేల్చేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ట్రాక్టర్‌తో పాటు 19 జిలెటన్‌ స్టిక్స్‌, డిటోనేటర్‌ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కెనడాలో ఉద్యోగాల పేరుతో

రూ.4లక్షల వసూలు

ఐదుగురిని మోసం చేసిన వారిపై కేసు

ఖమ్మంఅర్బన్‌: కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఐదుగురు యువకుల నుంచి రూ.4 లక్షలు వసూలు చేసిన ముఖం చాటేసిన ఘటనపై ఖమ్మం అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దానవాయిగూడెంకు చెందిన ఓ యువకుడు ఇన్‌స్ట్రాగామ్‌లో కెనడాలో పుడ్‌ ప్యాకింగ్‌ విభాగంలో ఉద్యోగాల ప్రకటన చేశాడు. హరియాణాలోని అంబాల ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించిన కన్సల్టెన్సీ బాధ్యులను సంప్రదించారు. అంతేకాక అక్కడికి రెండుసార్లు వెళ్లి వివరాలు పరిశీలించిన అనంతరం ఐదుగురు యువకులు పది నెలల క్రితం రూ.3.15 లక్షలు ఆన్‌లైన్‌లో, మరో రూ.85 వేలు నగదు రూపంలో ఇచ్చారు. ఆతర్వాత ఉద్యోగాలు ఇప్పించకపోవడం, కన్సల్టెన్సీ బాధ్యులు స్పందించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన యువకులు పోలీసులను ఆశ్రయించారు. ఈమేరకు కన్సల్టెన్సీకి చెందిన వీరేంద్ర సింగ్‌, సుధా మిత్రాపై సోమవారం కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు.

రైలు ఢీకొని సిగ్నల్‌

టెక్నీషియన్‌ మృతి

పదోన్నతి వచ్చిన 47రోజులకే ప్రమాదం

మధిర: మధిర రైల్వేస్టేషన్‌ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్‌ సిగ్నల్‌ టెక్నీషియన్‌ మద్దుకూరి శివరామ బ్రహ్మం(44) రైలు ఢీకొని మృతి చెందాడు. ఆయన ఆదివారం రాత్రి 8–25 గంటల సమయాన విధి నిర్వహణలో భాగంగా డౌన్‌ రైల్వేట్రాక్‌పై పరిశీలిస్తూ వెళ్తున్నాడు. అదే సమయాన ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న జీఆర్‌పీ సిబ్బంది కేసు నమోదు చేసి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కాగా, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామానికి చెందిన శివరామ బ్రహ్మం పదోన్నతిపై 47 రోజుల క్రితమే నూతనంగా ఏర్పాటైన మధిర డివిజన్‌కు వచ్చారు. భార్య, కుమారుడు స్వగ్రామంలో ఉండగా, ఆయన మధిర శ్రీనగర్‌ కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఇటీవల దసరా పండుగకు స్వగ్రామానికి వెళ్లి వచ్చిన బ్రహ్మం మృతితో కుటుంబంలోనే కాక ఉద్యోగుల్లో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement