వైరా: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దసరా పండుగకు మద్యం విక్రయాలు భారీగా తగ్గాయి. ఈనెల 17వ తేదీన జిల్లాలోని వైన్స్, బార్ల నిర్వాహకులు వైరాలోని డిపో నుంచి రూ.11 కోట్ల విలువైన మద్యం తీసుకెళ్లారు. ఇక 18న ఆదివారం సెలవు కాగా, 19వ తేదీన రూ.13.50 కోట్ల విలువైన మద్యం తీసుకెళ్లారు. గత ఏడాది దసరా పండుగ గాంధీ జయంతి రోజున రావడంతో ముందస్తుగానే వ్యాపారులు కొనుగోళ్లు చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.180 కోట్లు మద్యం అమ్మకాలు జరగగా, ఆనెల 29, 30వ తేదీ రెండు రోజుల్లో రూ.42 కోట్లు మద్యం అమ్మకాలు సాగాయి. కానీ ఈసారి దసరాకు ముందు 17, 19వ తేదీల్లో కేవలం రూ.24.50 కోట్ల విలువైన మద్యమే షాప్‌లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది తక్కువ కావడం వెనుక వాతావరణ పరిస్థితులు కలిసి రాకపోవడంతో పాటు దసరా పండుగ నెల మధ్యలో రావడం ఇంకో కారణం కావొచ్చని భావిస్తున్నారు. జిల్లాలోని 47 బార్లు, 206 వైన్స్, మూడు క్లబ్‌ల ద్వారా రోజుకు సగటున రూ.6కోట్ల నుంచి రూ.7 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతాయని అంచనా.


