కిటకిటలాడిన కోటమైసమ్మతల్లి ఆలయ ప్రాంగణం
వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్న భక్తులు
కారేపల్లి: జాతరెళ్లి పోదామే.. జాతరో, జాతర.. అంటూ వేలాదిగా భక్తజనం శ్రీ కోటమైసమ్మతల్లి ఆలయానికి తరలివచ్చారు. కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో కొలువుదీరిన కోటమైసమ్మ తల్లి ఆలయ ఆవరణలో దసరా సందర్భంగా జాతర మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నుంచే కాక చుట్టు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వాహనాల్లో వచ్చారు. అలాగే, బుధవారం కూడా ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. జాతర ఈనెల 26వ తేదీ వరకు కొనసాగనుండగా, దేవాదాయ శాఖ ఈఓ కట్టుకూరు వెంకటయ్య, పర్సా ట్రస్టు చైర్మన్ పట్టాభిరామారావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సందడే.. సందడి
జాతర ఆవరణలో చిన్నారులు, పెద్దల ఆటవిడుపు కోసం సర్కస్ ఏర్పాటుచేశారు. ఇందులో జాయింట్ వీల్స్, జంపింగ్ డాల్స్, టవర్ రైడర్ వంటి ఉండడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని వీటిలో ఎక్కి సందడి చేశారు. కాగా, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి పర్యవేక్షణలో సింగరేణి సీఐ ఎన్ సాగర్, ఎస్‌ఐ బి.గోపితో పాటు ఇతర ప్రాంతాల సీఐలు, ఎస్సైలు, సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. తొలిరోజు జాతరకు పెద్దసంఖ్యలో భక్తులు రావడంతో గంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు సోలార్ ప్లాంట్ నుంచి పోలంపల్లి బైపాస్ రోడ్డుకు వాహనాలను మళ్లించారు. అలాగే, కారేపల్లి, సీతారాంపురం గ్రామాల నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లించడంతో పరిస్థితి చక్కబడింది.


