మణుగూరు టౌన్: ఉద్యోగులు సమష్టిగా కృషి చేస్తూ బొగ్గు ఉత్పత్తి వార్షిక లక్ష్యాలను చేరుకోవాలని సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్.వీ.సూర్యనారాయణ సూచించారు. మణుగూరు ఏరియాలో జీఎం దుర్గం రాంచందర్తో కలిసి బుధవారం ఆయన కేసీహెచ్పీ, పీకేఓసీ–2 గనులను పరిశీలించారు. బొగ్గు ఉత్పత్తి, క్రషర్ల పనితీరును పరిశీలించాక డైరెక్టర్ మాట్లాడుతూ ఏరియా వార్షిక లక్ష్యం 122.10లక్షల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి కోసం రోజూ 40వేల టన్నులు వెలికితీయాలని తెలిపారు. యంత్రాలతో నిరంతరాయంగా పనులు చేపడితే ఫలితం ఉంటుందని చెప్పారు. అలాగే, పీకేఓసీ–2లోని నీటిని సకాలంలో తొలగించాలని సూచించారు. వివిధ విభాగాల అధికారులు మదన్నాయక్, గౌడే, సౌరభ్ సుమన్, సురేశ్, నాగరమేశ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


