●గుర్తించి అప్పగించిన జీఆర్‌పీ సిబ్బంది
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు నుంచి జారిపడిన రూ.7లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను జీఆర్‌పీ పోలీసులు గుర్తించి బాధితుడికి అప్పగించారు. విజయవాడ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రిటైర్డ్ ఉపాధ్యాయుడు పమిడిముక్కల శ్రీకృష్ణ గౌతమ్ కుటుంబ సభ్యులతో ఖమ్మం బుర్హాన్‌పురంలో నివాసముంటున్నాడు. ఆయన శనివారం తన పీఎఫ్ ఖాతా నుంచి రూ.7లక్షలు విత్‌డ్రా చేసుకుని గుంటూరులో బంగారం కొనుగోలు చేసేందుకు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. రైలు విజయవాడ స్టేషన్ చేరుకునే ముందు ఔటర్‌లో నెమ్మదిగా వెళ్తుండగా కుదుపులతో ఆయన చేతిలోని నగదు బ్యాగ్ జారి కిందపడింది. ఈమేరకు విజయవాడ జీఆర్‌పీ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ పి.కనకారావుకు ఫిర్యాదు చేయగా క్రైం టీమ్, ఆర్‌పీఎఫ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ట్రాక్ వెంట ఎక్కడా బ్యాగ్ లభించకపోవడంతో స్టేషన్‌కు పరిసరాల్లోని యాభై సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తే ఓ వ్యక్తి ఆ బ్యాగ్ తీసుకెళ్లినట్లు తేలింది. సదరు వ్యక్తిని పాత ఆర్‌ఆర్‌పేటలో నివసించే లక్కు చినకాసయ్యగా గుర్తించి ఆయన నుంచి రూ.7లక్షల నగదుతో పాటు రెండు గ్రాముల బంగారంతో పూతపూసిన చేతి గడియారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు ఆదివారం జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ కనకారావు సమక్షాన శ్రీకృష్ణ గౌతమ్‌కు నగదు అప్పగించారు. ఫిర్యాదు అందగానే వేగంగా స్పందించి సాంకేతిక ఆధారాలతో నగదు గుర్తించి బాధితుడికి అప్పగించడంపై రైల్వే డీఎస్‌పీ జయసూర్య సిబ్బందిని అభినందించారు.


