మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి
పోటు రంగారావు
సత్తుపల్లిటౌన్: కేంద్రప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యుత్ సవరణ చట్టంలో భాగంగా వినియోగదారుల ఇళ్లకు మీటర్ల బిగించడం చార్జీల భారం పడడమే కాక బలవంతంగా వసూలు చేసే అవకాశముందని మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవటం దారుణమని తెలిపారు. అర్హులందరికీ పెన్షన్ల మంజూరు. విద్యుత్ కోతలను అరికట్టాలని డిమాండ్‌తో మాస్‌లైన్ ఆధ్వర్యాన మంగళవారం సత్తుపల్లిలో ప్రదర్శన నిర్వహించి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆతర్వాత ఎంపీడీఓ నాగేశ్వరరావుకు వినతిపత్రం ఇవ్వగా రంగారావు మాట్లాడుతూ విద్యుత్ సవరణ చట్టం వల్ల ప్రజలు ఇబ్బంది పడితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు అనేక హామీలు ఇవ్వగా, పింఛన్ల మంజూరులోనూ విఫలమయ్యారని ఆరోపించారు. జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా విద్యుత్ కోతలు పెరగడంతో ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి సీ.వై.పుల్లయ్య, నాయకులు గంట శ్రీనివాస్, బిరెల్లి లాజర్, అమర్లపూడి శరత్, రాజు, వెంకటేష్, నాగిరెడ్డి, పుల్లారావు, మ్యాలాద్రి, రాజారావు, నాగప్రసాద్, దేవి పాల్గొన్నారు.


