ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన, సంపూర్ణ ఉద్యోగ భద్రత, సంస్థ విలీన ప్రక్రియను త్వరగా పూర్తి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఐక్య కూటమి కృషి చేస్తుందని టీఎంయూ నేత అశ్వథామరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా రీజియన్ స్థాయి సభ ఖమ్మం డిపో వద్ద మంగళవారం నిర్వహించారు. తొలుత ఖమ్మం పాత బస్టాండ్ నుండి డిపో వరకు ప్రదర్శన నిర్వహించగా, ఆ తర్వాత సభలో అశ్వథామరెడ్డి మాట్లాడుతూ రామారావు ఆశయ సాధనకు అనుగుణంగా ఎరజ్రెండా వెంటే కార్మిక సమాజం నడవాలని కోరారు. గత ప్రభుత్వాల నిర్ణయాలతో కార్మికులు వేతన సవరణ, హయ్యర్ పెన్షన్ విషయంలో నష్టపోయారని తెలిపారు. కార్మికుల నుంచి రికవరీ చేసిన పీఎఫ్ బకాయిలను ప్రభుత్వం క్రమం తప్పక జమ చేస్తే రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు అదనపు పెన్షన్ లభిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 2021 వేతన సవరణ, మాస్టర్ స్కేల్స్ అమలు, డీఏ బకాయిల విడుదలకు కృషి చేయడమే కాక విలీనం, సంపూర్ణ ఉద్యోగ భద్రత, కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సదుపాయాలు కల్పించడమే ధ్యేయమని తెలిపారు. కార్మికుల సంక్షేమమే అజెండాగా పనిచేస్తున్న ఐక్య కూటమి అభ్యర్థుల బాణం, నక్షత్రం గుర్తులకు ఓట్లు వేసి టీడబ్ల్యూయూ – ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమిని గెలిపించాలని కోరారు. ఈ సభకు గుర్రం ఉప్పలయ్య, గుండు మాధవరావు అధ్యక్షత వహించగా, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌రావు, ముగిళ్ల రాజిరెడ్డి మాట్లాడారు. వివిధ పార్టీలు, సంఘాల నాయకులు నాగండ్ల దీపక్‌చౌదరి, జి.రామయ్య, కళ్యాణం వెంకటేశ్వరరావు, విష్ణు, వి.రవీందర్‌రెడ్డి, గడ్డం లింగమూర్తి, మెరుగు రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌టీసీ ఎన్నికల ప్రచార సభలో
అశ్వథామరెడ్డి


