పనిభారం తగ్గించాలి
● సతమతమవుతున్న జీపీఓలు ● అదనపు విధుల నుంచి తప్పించాలని విన్నపాలు
ఖమ్మం సహకారనగర్: క్షేత్రస్థాయిలో ఏ పని కావాలన్నా అటు అధికారులు, ఇటు ప్రజలకు మొదటగా గుర్తొచ్చేది గ్రామ పాలన అధికారులే(జీపీఓ). అయితే, అన్ని రకాల పనులు తమపై మోపడంతో ఒత్తిడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. ఇకనైనా ఒత్తిడి తగ్గించడమే కాక సెలవు దినాల్లోనైనా విశ్రాంతి ఇవ్వాలని కోరుతున్నారు.
లెక్క లేనన్ని పనులు..
జిల్లాలో 21మండలాల పరిధి, 385 రెవెన్యూ గ్రామాలకుగాను 299మంది జీపీఓలు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, 385 రెవెన్యూ గ్రామలకు అంతే సంఖ్యలో పోస్టులు మంజూరు చేయాల్సి ఉన్నా, 299 క్లస్టర్లుగా విభజించారు. కాగా, ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా అందుకోసం ప్రజ లకు కావాల్సిన సర్టిఫికెట్ల జారీలో జీపీఓలు కీలకంగా వ్యవహరిస్తుంటారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ, కల్యాణలక్ష్మి దరఖాస్తుల విచారణతో ఓటర్ల సవరణ జాబితా బీఎల్‌ఓల సూపర్‌వైజర్లుగా పనిచేస్తున్నారు. అంతేకాక రెవెన్యూ సంబంధిత సేవలు, భూముల రీ సర్వే, విపత్తుల సమయాన క్షేత్రస్థాయిలో విధులు, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాల్లోనూ పాలుపంచుకోవాల్సి వస్తోంది.
అన్ని ఒకేసారి..
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇదేసమయాన ప్రభుత్వం భూముల రీ సర్వే చేపడుతోంది. మరోపక్క రెవెన్యూకు సంబంధించి వివిధ ధ్రువపత్రాల జారీ కోసం విచారణ చేయాల్సి ఉంటుంది. ఇలా అన్ని పనులు ఒకేసారి ఉండడంతో రాత్రి పొద్దుపోయే వరకు విధులు నిర్వర్తించినా పూర్తి కావడం లేదని జీపీఓలు వాపోతున్నారు. కొన్నిసార్లు సెలవు దినాలు, పండుగల రోజుల్లోనూ పనిచేయాల్సి వస్తోందని చెబుతున్నారు.
పెరుగుతున్న పనిభారం
రోజువారీ ధ్రువపత్రాల విచారణలు, రెవెన్యూ సేవలతో పాటు ప్రత్యేక విధులు పెరుగుతుండగా.. విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తోందని జీపీఓలు వాపోతున్నారు. వారాంతపు సెలవులు, పండుగ సెలవుల్లోనూ విధులకు రావాల్సి వస్తోందని, అత్యవసర పరిస్థితుల్లో విధులు నిర్వహించడం ఇబ్బందేమీ కాకున్నా. అదనపు విధులు నిరంతరం కొనసాగుతుండడంతో సమస్య వస్తోందని చెబుతున్నారు. భూముల రీ–సర్వేలో జీపీఓలు పాల్గొంటుండడంతో ధ్రువపత్రాల దరఖాస్తుల పరిశీలన, జారీలో జాప్యం జరిగి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. పని భారం తగ్గింపుపై ప్రభుత్వం దృష్టి సారించి, మానవ వనరులు, మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.
ప్రస్తుతం ఎస్‌ఐఆర్ విధులు, భూముల రీ సర్వే విధులతో పాటు ఇతర పనులు ఏకకాలంలో చేయాల్సి రావడంతో మానసికఒత్తిడికి గురవుతున్నాం. సెల వు దినాల్లో కూడా పనిచేయాల్సి రావటం ఇబ్బందిగా ఉంది. ఇకనైనా మాపై భారాన్ని తగ్గించేలా ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. – చీమల నాగేంద్రబాబు,
జిల్లా అధ్యక్షుడు, జీపీఓల అసోసియేషన్


