తిరుమలాయపాలెం: గణేశ్ నిమజ్జనం రోజున పోలీసు వాహనానికి డ్రైవర్‌గా వెళ్లగా, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తిరుమలాయపాలెం పోలీసుస్టేషన్ పెట్రోలింగ్ వాహనానికి డ్రైవర్ అందుబాటులో లేక ఈనెల 23న ఎస్‌ఐ కూచిపూడి జగదీష్ కాకరవాయికి చెందిన కొత్తపల్లి రాకేష్(22)ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రోజు కాకరవాయిలో పెట్రోలింగ్ ముగిశాక, జల్లేపల్లి వివాదం జరుగుతోందనే సమాచారంతో ఎస్సైతో కలిసి వెళ్లి, రాత్రి తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. అర్ధరాత్రి సమయాన ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో రాకేష్ తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యా యి. తొలుత ఖమ్మంలో చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే పరిస్థితి విషమించడంతో రాకేష్ మంగళవారం మృతి చెందాడు. కాగా, ఈ ప్రమాదంలో ఎస్సై జగదీష్ కూర్చున్న సీటు వైపు ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడి చికిత్స పొందుతున్నాడు.
కుటుంబానికి అండగా నిలిచే సమయాన..
రాకేష్ తల్లిదండ్రులు నాగయ్య – పద్మ వ్యవసాయ పనులతో పాటు కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. ఆయన అన్న సాయి తల్లిదండ్రులకు వ్యవసాయంతో చేదోడుగా ఉంటున్నాడు. డిగ్రీ పూర్తిచేసిన రాకేష్ కొంతకాలం హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేశాక స్వగ్రామమైన కాకరవాయికి వచ్చి ఇక్కడే పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. ఈమేరకు ఆయన మృతితో కుటుంబీకులే కాక స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మృతదేహం మంగళవారం రాత్రి కాకరవాయికి చేరగా, బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత


