నేలకొండపల్లి: స్వయం సహాయక సంఘం సభ్యులు తీసుకున్న రుణాలతో వ్యాపారాల ఏర్పాటు, నిర్వహణ, ఆర్థికాభివృద్ధిపై కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. నేలకొండపల్లిలోని వన్ స్టాప్ ఫెసిలిటీ(ఓఎస్‌ఎఫ్) ద్వారా రూ.2 లక్షల రుణంతో ఏర్పాటుచేసిన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ కేంద్రాన్ని బృందం మంగళవారం పరిశీలించింది. నేషనల్ ఇన్‌స్ట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్(ఎన్‌ఐఆర్‌డీ)లో శిక్షణ పొందుతున్న త్రిపుర, నాగాలాండ్, మహారాష్ట్ర, అస్సాం, మిజో రం రాష్ట్రాల అధికారులు 32 మంది రాగా, కేంద్రం నిర్వాహకురాలు మరికంటి ఉమారాణితో మాట్లాడారు. రుణం, యంత్రాల ఖరీదు, ఆర్థికాభివృద్ధి, ఎందరికి ఉపాధి లభిస్తుందనే వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మదర్ థెరిస్సా మండల సమాఖ్య కార్యాలయంలో సమాఖ్య ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఆతర్వాత భక్తరామదాసు ధ్యాన మందిరం, బౌద్ధక్షేత్రాన్ని సందర్శించారు. సెర్ప్ ప్రాజెక్ట్ మేనేజర్ రాము, ఐకేపీ డీపీఎం శ్రీనివాస్, ఏపీఎం సురేందర్‌బాబు, గ్రామ దీపికల సంఘం నాయకులు రాజపుత్ర పార్వతీబాయి, మల్లెబోయిన పుష్ప, కె.లావణ్య తదితరులు పాల్గొన్నారు.
నేలకొండపల్లిలో కేంద్ర బృందం పరిశీలన


