స్థలం సరిపోవడం లేదు.. | - | Sakshi
Sakshi News home page

స్థలం సరిపోవడం లేదు..

Sep 30 2026 12:34 AM | Updated on Sep 30 2026 12:34 AM

స్థలం సరిపోవడం లేదు.. యార్డు బయటే చెత్త యార్డు ఎక్కడ?

ఇబ్బందిగా ఉంది..

యార్డ్‌ స్థలాన్ని సేకరించాలి..

కేఎంసీ పరిధిలో సరిపోని ఆవరణ

మధిరలో యార్డు బయటే..

వైరాలో కొలిక్కిరాని స్థలసేకరణ

ఏదులాపురంలో ఇటీవలే స్థల గుర్తింపు

ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 60 డివిజన్లు ఉండగా, 171 వాహనాల ద్వారా ప్రతిరోజు 190 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్తలను వేర్వేరుగా స్వీకరించాల్సి ఉన్నా అలా జరగడంలేదు. ఈ వ్యర్థాలను దానవాయిగూడెంలోని 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. ఈ ఆవరణ నిండడంతో బయోమైనింగ్‌ ద్వారా వ్యర్థాలను శుద్ధి చేసి 20 ఎకరాలకు పైగా స్థలాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్థలంలో మొక్కలు నాటడంతో చెత్త వ్యర్థాల డంపింగ్‌కు వీల్లేకుండా పోయింది. మిగిలిన 11 ఎకరాల్లో తడి, పొడి, ఇతర వ్యర్థాలను కుప్పగా పోస్తుండడంతో రోజురోజుకు నిండడంతో పాటు ఈ ప్రాంతమంతా కాలుష్యమయమవుతోంది. మరోపక్క దుర్వాసనతో చుట్టుపక్కల వారు ఇబ్బంది పడుతున్నారు.

మధిర మున్సిపాలిటీ పరిధి మడుపల్లి శివారు ఐదెకరాల్లో డంపింగ్‌ యార్డ్‌ ఏర్పాటుచేశారు. షెడ్లు నిర్మించినా అందులో కాకుండా ఆరు బయట చెత్త వేసి నిప్పు పెడుతుండడంతో పొగ వస్తోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను ప్రెస్‌ చేసే బెయిలింగ్‌ మిషన్‌ ఏర్పాటు చేసి మూడు నెలలు గడిచినా వినియోగించడం లేదు. ప్లాస్టిక్‌ వస్తువులను పాత ఇనుము షాపుల వారికి నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారు. కార్మికులు, వాహనాల కొరతతో కొన్నిచోట్ల వారానికోసారి, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులతో వాహనాలు సరిగా వెళ్లక ఇంకొన్ని ప్రాంతాల్లో ఇరవై రోజులకోసారి కూడా చెత్త సేకరణ జరగడంలేదు. దీంతో షాపుల యజమానులు ప్రధాన రహదారుల పక్కన పడేస్తున్నారు. డంపింగ్‌ యార్డ్‌లో కొంత మిషనరీ రావాల్సి ఉండడంతో రీసైక్లింగ్‌ చేయడం లేదని ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ అజయ్‌ తెలిపారు.

వైరా మున్సిపాలిటీలో డంపింగ్‌ యార్డ్‌ స్థల సేకరణకు గత ఏడాది రూ.3 కోట్లు కేటాయించారు. తల్లాడ మండలం కొడవటి మెట్టు రెవెన్యూలో మూడెకరాల స్థలాన్ని గుర్తించినా పట్టణానికి దూరంగా ఉండటంతోపాటు వర్షాకాలంలో వైరా నదిని దాటి వెళ్లాల్సి ఉన్నందున అడ్డంకులు ఎదురయ్యాయి. తొలుత స్టేజీ పినపాక హై లెవెల్‌ వంతెన సమీపాన చెత్త పోసి నిప్పు పెట్టడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అక్కడ రైతులు కూడా అడ్డుకోవడంతో ఇప్పుడు వైరా ఏటిని ఆనుకుని చెత్త పోశారు. ఆపై వైరా ఏటి అవతల ఉన్న కొడవటిమెట్ట రెవెన్యూలోని ప్రభుత్వ స్థలం వద్దకే తరలిస్తున్నారు. ఇందుకు బదులు కొణిజర్ల మండలం దిద్దిపూడి రెవెన్యూలో మూడెకరాల స్థలాన్ని పరిశీలించినా సమీపంలో ఉన్న ప్రైవేట్‌ పాఠశాల నుంచి డంపింగ్‌ యార్డ్‌ ఏర్పాటు చేయొద్దనే డిమాండ్‌ రావడంతో అధికారులు వెనక్కి తగ్గారు.

●ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డులు, 70 వేల జనాభా ఉన్నారు. ఇక్కడ రోజుకు 10 టన్నుల చెత్త సేకరిస్తున్నారు. కొత్త మున్సిపాలిటీ కావడంతో డంపింగ్‌ యార్డు లేక పల్లెగూడెం, తెల్దారుపల్లి ఏరియాతో పాటు వార్డుల్లో స్థలం ఉన్న చోట చెత్త వేస్తున్నారు. డంపింగ్‌ యార్డ్‌ కోసం ఆరు నెలల క్రితం స్థలం చూసినా నిర్మాణాలు మొదలుకాలేదు.

●కల్లూరు మున్సిపాలిటీ 2025 మే నెలలో ఏర్పాటైంది. ఏడు గ్రామ పంచాయతీలను విలీనం చేసి కల్లూరు మేజర్‌ గ్రామపంచాయతీని కలుపుతూ మున్సిపాలిటీగా మార్చారు. 1.05 ఎకరాల ఎన్నెస్పీ భూమిలో డంపింగ్‌యార్డు ఏర్పాటైంది. 2025 జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు మాత్రం మధిర రోడ్డులోని ఎన్నెస్పీ కాలువ పక్కన చెత్త వేశారు. ప్రస్తుతం డంపింగ్‌ యార్డులోనే చెత్త వేస్తున్నారు. ఇక విలీన గ్రామపంచాయతీల్లోనూ డంపింగ్‌ యార్డులు ఉన్నాయి.

●సత్తుపల్లి మున్సిపాలిటీకి కొమ్మేపల్లి వద్ద డంపింగ్‌యార్డు ఉంది. కొందరు ట్రాక్టర్‌ డ్రైవర్లు సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డులో కాకుండా పాత ఎన్‌టీఆర్‌ కాల్వలో పడేస్తున్నారు. డంపింగ్‌యార్డులో బయోమైనింగ్‌ ఏర్పాటు చేయగా దాదాపు ఏడెకరాలు మళ్లీ వినియోగంలోకి వచ్చింది.

డంపింగ్‌ యార్డు నుంచి వచ్చే దుర్వాసన తట్టుకోలేకపోతున్నాం. తాగునీరు కూడా కలుషితమయ్యాయి. సందీప్‌కుమార్‌ ఝా కమిషనర్‌గా ఉన్నప్పుడు యార్డును డంపింగ్‌యార్డును మార్చారు. మళ్లీ ఇక్కడే ఏర్పాటుచేయడంతో ఇబ్బంది పడుతున్నాం. – పగడాల నాగేశ్వరరావు,

దానవాయిగూడెం, ఖమ్మం

వైరా మున్సిపాలిటీ ఏర్పడి తొమ్మిదేళ్లయినా డంపింగ్‌ యార్డ్‌ లేదు. నిత్యం మున్సిపల్‌ వాహనాల ద్వారా చెత్త సేకరిస్తున్నా యార్డ్‌ ఏర్పాటుచేయలేకపోతున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలి. లేదంటే చెత్త మళ్లీ రోడ్ల వెంట వేస్తారు.

– గార్లపాటి ప్రవీణ్‌, బ్రాహ్మణపల్లి, వైరా

పురపాలికల్లో డంపింగ్‌ యార్డుల సమస్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement