ఖమ్మం సహకారనగర్: జిల్లా విద్యాశాఖాధికారిగా నియమితులైన వాసంతి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సదానందం ఇన్‌చార్జ్ డీఈఓగా వ్యవహరించారు. ఆ స్థానంలో నియమితులైన వాసంతి విధుల్లో చేరగా, కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు ఆధ్వర్యాన నాయకులు డీఈఓకు శుభాకాంక్షలు తెలపగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గండు యాదగిరి, షేక్ మన్సూర్, నాయకులు పోతగాని వెంకన్న, రాజు పాల్గొన్నారు. అంతేకాక టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావుతో పాటు నాయకులు వెంకన్న, రాంబాబు, సురేష్ తదితరులు డీఈఓను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈమేరకు ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో పని చేస్తున్న ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని వారు కోరారు.
నిధుల వినియోగంపై సమీక్ష
జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధికి కేటాయించిన నిధులను నిబంధనల మేరకు సద్వినియోగం చేయాలని డీఈఓ డి.వాసంతి సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆమె పీఎంశ్రీ పాఠశాలల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లతో సమీక్షించారు. పాఠశాలల వారీగా పనులను నాణ్యతతో పూర్తిచేయించాలని తెలిపారు. ప్లానింగ్ కో ఆర్డినేటర్ రామకృష్ణ, ఏఎంఓ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


