● అక్టోబర్ 5, 6వ తేదీల్లో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు ● మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
ఖమ్మంమయూరిసెంటర్: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఎన్నికల కమిషన్‌ను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేయగా.. అది అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ధ్వజమెత్తారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వానికి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించి ఎన్నికల ఫలితాలను కూడా ప్రభావితం చేసే చర్యలకు పూనుకుందని ఆరోపించారు. తక్షణమే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూములు, ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ, అటవీ భూముల ఆక్రమణలపై విచారణ కోసం అఖిలపక్ష కమిటీని నియమించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఆరు గ్యారంటీలు, హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వచ్చేనెల 5, 6వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డివిజన్, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని రంగారావు తెలిపారు. అలాగే, బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి సీ.వై.పుల్లయ్య, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, ఆవుల అశోక్, బందెల వెంకయ్య, కమ్మకొమటి నాగేశ్వరరావు, మలీదు నాగేశ్వరరావు, శిరోమణి, ఝాన్సీ, కోయల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


