అల్పపీడనంతో ప్రస్తుతం జిల్లా అంతటా వర్షాలు పంటలకు అనుకూలం, చెరువులు, రిజర్వాయర్లలోకి వరద అయినా భవిష్యత్‌పై రైతుల్లో ఆందోళన
ఆనందమే అయినా..
ఈ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేశాడు. ఇప్పటివరకు సరైన వర్షం లేక పంటలకు సమస్య ఎదురైంది. అయితే, అల్పపీడన ప్రభావంతో జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సాగులో ఉన్న పంటలకు ఈ వాన మేలు చేసినా.. ఈ ఏడాది వర్షపాతం మాత్రం లోటులోనే ఉంది. ఈ సీజన్‌లో శుక్రవారం నాటికి జిల్లాలోని ఒక్కో మండలంలో 76.4 సెం.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 58.6 సెం.మీ.కే పరిమితమైంది. ప్రస్తుత వర్షం కురవకపోతే లోటు మరింత ఎక్కువగా ఉండేది. కాగా, గురువారం ఉదయం 8–30నుంచి శుక్రవారం ఉదయం 8–30 గంటల వరకు జిల్లాలో 5.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
మూడు నెలల్లో అంతంతే..
పంటల సాగులో అడుగడుగునా నీరు అవసరం. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు కురిస్తేనే పంటలు కళకళలాడతాయి. కానీ జిల్లాలో జూన్‌లో సగటు సాధారణ వర్షపాతం 13.సెం.మీ.కు 15.3 సెం.మీ, జూలైలో 24.1 సెం.మీ.కు 8.4 సెం.మీ, ఆగస్టులో 24 సెం.మీ.కు గాను 16.6 సె.మీ. వర్షపాతమే నమోదైంది. ఫలితంగా పంటల సాగుకు నీరు ఏ మాత్రం సరిపోలేదు. సాగుకు కీలకమైన జూలైలో అయితే 62 శాతం లోటు నమోదు కావడం గమనార్హం. వర్షాలు లేక, ప్రాజెక్టుల్లోకి నీరు చేరక పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. అడపాదడపా కురిసిన వర్షాలకు వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేసిన రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.
తాజా వర్షంతో హర్షం..
మూడు నెలల పాటు ఎదురుచూసిన రైతులకు గత రెండు రోజులుగా కురిసిన వర్షాలు ఉపశమనాన్ని కలిగించాయి. ఇన్నాళ్లు అడపాదడపా సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదలవుతున్న గోదావరి నీటితోనే రైతులు ముందుకు సాగారు. ఈక్రమాన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో పంట చేలు కళకళలాడుతున్నాయి. జిల్లాలో బుధవారం ఉదయం 8–30నుంచి గురువారం ఉదయం 8–30 గంటల వరకు 8.6 సెం.మీ., గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 5.1 సెం.మీ. వర్షపాతం నమోదు కావడంతో పంటలు ఎండిపోకుండా కాపాడినట్లయింది. అల్పపీడన ప్రభావంతో శనివారం కూడా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించగా... మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురిస్తే బాగుండని రైతులు భావిస్తున్నారు.
16 మండలాల్లో తక్కువే..
జిల్లాలోని 21 మండలాలకు గాను ఎక్కువ మండలాల్లో తక్కువ వర్షపాతమే నమోదైంది. సీజన్ ప్రారంభం నుంచి ఈనెల 25 వరకు 76.4 సెం.మీ. వర్షపాతానికి 58.6 సెం.మీ.గానే నమోదైంది. జిల్లాలోని 16 మండలాల్లో 20 – 59 శాతం లోటు ఉండగా, మిగిలిన ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఎర్రుపాలెం మండలంలో 46 శాతం లోటు నమోదైంది. ఈ మండలంలో 72.2 సెం.మీ.కు గాను 39.1 సెం.మీ. వర్షపాతమే నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక కూసుమంచిలో 37 శాతం, నేలకొండపల్లిలో 36, ఖమ్మం అర్బన్‌లో 34, రఘునాథపాలెంలో 33, కొణిజర్ల, వేంసూరు మండలాల్లో 32 శాతం లోటు ఉంది.
ఈ సీజన్‌లో కరుణించని వరుణుడు
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో జిల్లాలోని జలాశయాల్లోకి నీరు చేరుతోంది. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన పాలేరు, వైరా రిజర్వాయర్లలోకి వరద చేరుతుండడంతో రైతులు పంటలపై ఆశాజనకంగా ఉన్నారు. వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 18.3 అడుగులు కాగా.. ప్రస్తు తం ప్రాజెక్టు 19.6 అడుగులకు చేరి ఐదు అలుగు ల ద్వారా వరద దిగువకు వెళ్తోంది. పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగుల కు గాను వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉన్నా రానున్న రోజుల్లో వర్షం కురవకపోతే ఎలాఅని రైతులు ఆలోచనలో పడ్డారు.


