కలెక్టర్ దివాకర టీ.ఎస్.
మూడు మండలాల్లో రీసర్వే పరిశీలన
ఖమ్మం రూరల్/నేలకొండపల్లి/కూసుమంచి: భూసమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా సర్వే చేపడుతున్నట్లు కలెక్టర్ దివాకర టీ.ఎస్. వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలం కామంచికల్, నేలకొండపల్లి మండలం కొంగర, కూసుమంచి మండలం ఈశ్వరమాధారంలో జరుగుతున్న భూముల రీ సర్వేను కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పొలాల గట్లపై నడిచి భూముల వద్దకు చేరుకున్న ఆయన సర్వేను పరిశీలించి రైతుల అభ్యంతరాలు తెలుసుకుని వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సర్వే పూర్తయితే భూవివాదాలకు చెక్ పడుతుందని తెలిపారు. యజమానులకు మ్యాప్‌తో పట్టాలు అందిస్తామని, ఈ సమయాన ప్రైవేట్ వ్యక్తుల మధ్య పంచాయితీలో జోక్యం చేసుకోబోమని చెప్పారు. సర్వే సమయాన రైతులు పూర్తి ఆధారాలు సమర్పించి ఉద్యోగులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రెయినీ కలెక్టర్ పరాస్‌కుమార్, జిల్లా సర్వే ఏడీ రాజేందర్, తహసీల్దార్లు వినయేందర్‌రెడ్డి, పి.రాంప్రసాద్, సైదులు, ఉద్యోగులు మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కూసుమంచి: భారీ వర్షాలతో వరద వస్తున్న నేపథ్యాన అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌ను ఇరిగేషన్ సీఈ మంగళంపూడి వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించిన ఆయన కాల్వల గేట్లు, అలుగుల ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి వరద ముప్పు ఎదురుకాకుండా చూడాలని తెలి పారు. రిజర్వాయర్‌లో ఇప్పటికే పూర్తిస్థాయి నీరు చేరడంతో ఇకపై వచ్చే వరద వృథా కాకుండా చెరువులకు మళ్లించాలన్నారు. అంతేకాక కాల్వ ద్వారా, భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా విడుదల చేస్తూ రిజర్వాయర్ నీటిమట్టాన్ని 22 అడుగులుగా క్రమబద్ధీకరించాలని సూచించారు. అలాగే, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు రైతులు జాగ్రత్త పడేలా సూచనలు చేయాలని చెప్పారు. అసిస్టెంట్ ట్రెయినీ కలెక్టర్ పరాస్‌కుమార్, ఇరిగేషన్ డీఈఈ బాణాల రమేష్‌రెడ్డి, తహసీల్దార్ సైదులు, సర్పంచ్ బానోత్ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.


