త్వరలోనే ప్రభుత్వ కొనుగోళ్లు
ఖమ్మంవ్యవసాయం: ప్రైవేట్ మార్కెట్‌లో ధర దక్కక దిగాలు పడుతున్న పెసర రైతులకు త్వరలో తీపి కబురు అందనుంది. కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడగానే మద్దతు ధరతో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో అసలే అరకొరగా పంట పండగా, కేంద్రం క్వింటాకు రూ.8,780 గా ప్రకటించినా వ్యాపారులు రూ.5 వేల నుంచి రూ.6 వేలకు మించి చెల్లించడం లేదు. రైతుల వినతిని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని నాఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరగా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోమవారం నాటికి నాఫెడ్ నుంచి అంగీకారం వస్తే, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపడతారు. ఉమ్మడి జిల్లాలో ఈ వానాకాలం 40వేల ఎకరాల్లో పెసర సాగవగా, ఖమ్మం, మద్దులపల్లి, వైరా వ్యవసాయ మార్కెట్లతో పాటు మరికొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి.
వియత్నాం పర్యటనకు ఇద్దరు ఉపాధ్యాయులు
కల్లూరురూరల్: వియత్నాం దేశంలో బోధన, విద్యావ్యవస్థ పనితీరును పరిశీలించేందుకు రాష్ట్రం నుంచి ఉపాధ్యాయులు, అధికారులతో కూడిన 32మంది బృందం వెళ్లనుంది. ఈ బృందంలో జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులకు స్థానం దక్కింది. కల్లూరు మండలం చెన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలు దిగుమర్తి శిరీష, సింగరేణి మండలం పేరుపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు డి.జయరాజు ఇందులో ఉన్నారు. ఈ బృందం సభ్యులు అక్టోబర్ 10నుంచి 17వ తేదీ వరకు వియత్నాం పర్యటించి అక్కడ బోధన, పాఠశాలల నిర్వహన, పరీక్షలు నిర్వహించే పద్ధతి తదితర అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు.
నూతన బస్టాండ్ పనుల పరిశీలన
మధిర: మధిరలో నూతన బస్టాండ్ నిర్మాణ పనులను ఆర్‌టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలోమన్ శుక్రవారం పరిశీలించారు. ఖమ్మం ఆర్‌ఎం ఏ.సరిరామ్, డిప్యూటీ ఆర్‌ఎం ఏ.రాజేశ్వరరెడ్డితో కలిసి వచ్చిన ఆయన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మధిర ఆర్టీసీ డిపోను సందర్శించిన ఈడీ సర్వీసుల నిర్వహణ, ఆదాయంపై అధికారులతో చర్చించారు. ఖర్చులను నియంత్రిస్తూ ఆదాయం పెంపుపై దృష్టి సారించాలని, ఇదే సమయాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. డిపో మేనేజర్ టి.దేవరాజు, ఉద్యోగులు పాల్గొన్నారు.


