ఖమ్మం క్రైం: జిల్లావ్యాప్తంగా ఒకటి, రెండు రోజుల్లో పోలీసు శాఖలోని సీఐల బదిలీ లు జరగనున్నాయి. దాదాపు అందరికి స్థానచలనం కలిగే అవకాశముండగా, ఇప్పటికే ఉన్నతాధికారులు జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రధానంగా ఖమ్మం సబ్‌డివిజన్, ఖమ్మం రూరల్ పరిధిలో సీఐల పదవీకాలం రెండేళ్లు దాటడంతో దాదాపు అందరినీ కదిలించే అవకాశం ఉందని తెలిసింది.
మంచి పోస్టు కోసం సిఫారసులు
జిల్లాలో సీఐల బదిలీ ఖాయమని తేలడంతో పలువురు మంచి పోస్టు దక్కించుకునేందుకు పావులు కదుతున్నట్లు తెలిసింది. ఈమేరకు పది రోజులుగా ఎమ్మెల్యేలు, అధికార పార్టీ కీలక నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని సమాచారం. ఇంకొందరు ఓ అడుగు ముందుకేసి తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులను సైతం సంప్రదించి నచ్చినచోట పోస్టింగ్ కోసం సిఫారసు లేఖను జిల్లా అధికారులకు చేరవేసినట్లు తెలిసింది. ప్రధానంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కీలకమైన రెండు స్టేషన్లకు సీఐగా వచ్చేందుకు పలువురు పోటీ పడుతున్నట్లు సమాచారం. అంతేకాక రూరల్ పరిధిలోనూ ప్రధానమైన మూడు స్టేషన్ల కోసం భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న సీఐలు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఖమ్మం కమిషనరేట్ పరిధిలో లూప్‌లైన్‌లో ఉన్న కొందరు సీఐలకు ఈసారి మంచి పోస్టింగ్ కోసం కొందరు నేతల నుంచి అభయం అందినట్లు తెలిసింది.
కీలక స్థానాలపై కన్ను...
అభయ‘హస్తం’ కోసం పైరవీ


