ట్యాంకర్‌ నుంచి పామాయిల్‌ పక్కదారి? | - | Sakshi
Sakshi News home page

ట్యాంకర్‌ నుంచి పామాయిల్‌ పక్కదారి?

Sep 25 2026 12:23 AM | Updated on Sep 25 2026 12:23 AM

● ఆ స్థానంలో ఇంజన్‌ ఆయిల్‌, వాడిన నూనె కలుపుతున్నారని అనుమానాలు ● ఖమ్మం శివారులో గుర్తించిన పోలీసులు

● ఆ స్థానంలో ఇంజన్‌ ఆయిల్‌, వాడిన నూనె కలుపుతున్నారని అనుమానాలు ● ఖమ్మం శివారులో గుర్తించిన పోలీసులు

ఖమ్మం అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి మండలం సీతానగరం వద్ద ఉన్న ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ నుంచి హైదరాబాద్‌కు ట్యాంకర్ల ద్వారా తరలించే పామాయిల్‌ను తీసి, ఇతర నూనెలు కలుపుతున్నారనే ఆరోపణలు కలకలం రేపాయి. ఖమ్మం శివారులో దాబా వద్ద ట్యాంకర్‌ను ఆపిన సమయాన ఆటోలో క్యాన్లతో వచ్చిన పలువురు నూనె తీస్తుండగా బుధవారం రాత్రి ఖమ్మం అర్బన్‌ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ట్యాంకర్‌లోని పామాయిల్‌ తీసి, అనుమానం రాకుండా హోటళ్లలో వాడిన వంట నూనెతో పాటు ఇంజన్‌ ఆయిల్‌ కలుపుతున్నారని సమాచారం.

పక్కా సమాచారంతో...

ఖమ్మం శివారులో ట్యాంకర్‌ నిలిపి అందులో పామాయిల్‌ తీస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై కేసు నమోదు చేసినా వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఖమ్మం అర్బన్‌ సీఐ భానుప్రకాశ్‌ పేర్కొన్నారు. ట్యాంకర్‌, ఆటోతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఒక్కో ట్యాంకర్‌ నుంచి సుమారు వేయి లీటర్ల వరకు పామాయిల్‌ తీసి ఇతర నూనె కలుపుతున్నట్లు తెలియగా, ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారో తేలాల్సి ఉంది. అయితే, ఫ్యాక్టరీ నుంచి ట్యాంకర్‌ బయలుదేరే సమయాన నూనె నాణ్యతను ధ్రువీకరిస్తామని, మళ్లీ గమ్యాన్ని చేరాక కూడా పరీక్షిస్తారని తెలిసింది. కానీ మార్గమధ్యలో నూనె తీసి ఇతర నూనెలు కలుపుతుండగా, ఎవరెవరి పాత్ర ఉందో పోలీసుల విచారణలో బయటపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement