రిజర్వాయర్లలోకి చేరుతున్న వరద పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం ఉప్పొంగిన వాగులు, కూలిన చెట్లతో రాకపోకలకు అంతరాయం
మంత్రుల ఆరా.. అధికారుల అప్రమత్తత
అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఒట్టిపోయిన ప్రాజెక్టులు, చెరువుల్లోకి నీరు చేరుతోంది. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
జిల్లాలో 8.6 సెం.మీ.వర్షపాతం
జిల్లాలో బుధవారం ఉదయం 8–30నుంచి గురువారం ఉదయం 8–30 గంటల వరకు నగటున 8.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మధిర మండలంలో అత్యధికంగా 13.1 సెం.మీ., తిరుమలాయపాలెంలో 12.6, ముదిగొండ 12, బోనకల్ 11.1, కూసుమంచి 10.8. ఖమ్మం అర్బన్ 10.4 సెం.మీ.తో పాటు ఎర్రుపాలెం, చింతకాని, వైరా, తల్లాడ తదితర మండలంలో కూడా వర్షప్రభావం ఉంది. అతితక్కువగా సత్తుపల్లి మండలంలో 3.3 సెం.మీ.గా నమోదైంది. ఈ సీజన్‌లో 24వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 76.1 సెం.మీ. కాగా.. 53.2 సెం.మీ. వర్షపాతం నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఇప్పటి వరకు 30 శాతం లోటే ఉండగా, 18 మండలాల్లో తక్కువగా, మూడు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
సామర్థ్యానికి మించి వైరా, గరిష్ట స్థాయికి పాలేరు
నిన్నామొన్నటి వరకు నీరు లేని రిజర్వాయర్లలోకి వర్షంతో వరద చేరుతోంది. పాలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా.. గురువారం రాత్రి 22 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాలైన మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి 15వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. ఫలితంగా శక్రవారం ఉదయంకల్లా నీటిమట్టం గరిష్టస్థాయికి చేరే అవకాశముండగా ముందస్తు జాగ్రత్తతో ఎడమ కాల్వ ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వైరా రిజర్వాయర్‌లోకి 3,142 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. పూర్తిస్థాయి నీటిమట్టమైన 18.3 అడుగులకు గాను 19.4 అడుగులకు చేరడంతో అలుగు ద్వారా వరద వెళ్తోంది. ఈ వరదతో ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ నగర్ కాలనీ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదే సమయాన మున్నేటికి మాత్రం వరద స్వల్పంగానే వస్తోంది. ఖమ్మం జల వనరుల సర్కిల్ పరిధిలోని 471 చెరువుల్లో 160 చెరువులు 25 శాతం, 176 చెరువులు 50 శాతం, 86 చెరువులు 75 శాతం, 31 చెరువులు నూరు శాతం నిండగా.. 19 చెరువులు మత్తడి పోస్తున్నాయి.
పంటలకు ఊపిరి
ఈ వర్షాకాలంలో ఇదే భారీ వర్షం కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సీజన్‌లో అన్ని పంటలు కలిపి 5,09,978 ఎకరాల్లో సాగవగా.. వరి అత్యధికంగా 2,41,109 ఎకరాలు, పత్తి 2,35,637 ఎకరాల్లో ఉన్నాయి. ప్రధానంగా వరి పంటకు ఇప్పుడు తడులు అవసరం కావడంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఊపిరి పోసినట్లయింది. ఇదే సమయాన పలుచోట్ల మిర్చి, పత్తి చేన్లలో భారీగా వరద చేరడంతో దెబ్బతిన్నాయి.
జిల్లాలో ఎడతెరిపి లేకుండా వాన
వర్షాల నేపథ్యాన ఉమ్మడి జిల్లాలో పరిస్థితులపై రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. రెండు జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రధాన జలాశయాల్లో నీటిమట్టాలు, లోతట్టు ప్రాంతాల పరిస్థితి, వాగులు, వంకల ప్రవాహాన్ని నిరంతరం గమనించాలని సూచించారు. మరోపక్క జిల్లా అధికార యంత్రాంగం కూడా వరద వస్తే చేపట్టాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. స్థానిక యంత్రాంగం సూచనలు పాటించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్.కోరారు.


