ఆర్టీసీ పోరు.. పొత్తుల హోరు ! | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ పోరు.. పొత్తుల హోరు !

Sep 25 2026 12:23 AM | Updated on Sep 25 2026 12:23 AM

● రీజియన్‌లో వేడెక్కిన ‘గుర్తింపు’ రాజకీయం ● ఈసారి వేర్వేరు దారుల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌, ఈయూ ● నేడు ఓటర్ల తుది జాబితా విడుదల

ఖమ్మం, వరంగల్‌ ఎన్‌ఎంయూకు..

● రీజియన్‌లో వేడెక్కిన ‘గుర్తింపు’ రాజకీయం ● ఈసారి వేర్వేరు దారుల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌, ఈయూ ● నేడు ఓటర్ల తుది జాబితా విడుదల

ఖమ్మంమయూరిసెంటర్‌: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో ఖమ్మం రీజియన్‌లో రాజకీయం వేడెక్కింది. రీజియన్‌లో గుర్తింపు పొందేందుకు ప్రధాన కార్మిక సంఘాలు తమ బలాబలాలను లెక్కించుకుంటూ గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో కుదురుతున్న పొత్తులకు అనుగుణంగా రీజియన్‌ స్థాయిలో కలిసొచ్చే సంఘాలను కలుపుకుని వెళ్లేందుకు పావులు కదుపుతున్నాయి.

మారిన సమీకరణాలు

జిల్లాలో ఈసారి ఎన్నికల సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌(సీఐటీయూ అనుబంధం), ఈయూ(ఏఐటీయూసీ అనుబంధం) పొత్తుతో పోటీ చేశాయి. అప్పటి అధికార పార్టీ అనుబంధ సంఘమైన టీఎంయూ ఒంటరిగా బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ – ఈయూ కూటమి మెజారిటీ డిపోల్లో అత్యధిక ఓట్లు సాధించి రీజియన్‌లో గుర్తింపు దక్కించుకుంది. ఈసారి మాత్రం ఎస్‌డబ్ల్యూఎఫ్‌, ఈయూ ఈసారి వేర్వేరు దారుల్లో పయనిస్తున్నాయి. ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఈసారి తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌(టీడబ్ల్యూయూ)తో చేతులు కలిపింది. ఇక ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఈయూ)కు రాష్ట్ర స్థాయిలో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌(ఎన్‌ఎంయూ)తో పొత్తు ఖరారైంది. దీంతో రీజియన్‌లోనూ ఇదే పొత్తుతో ముందుకెళ్లనున్నట్లు నేతలు స్పష్టం చేశారు. కొత్త సమీకరణాలతో ఎన్నికల పోరు ఉత్కంఠభరితంగా మారనుందనే చర్చ కార్మిక వర్గాల్లో సాగుతోంది. ఇక అధికార పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ ఈ ఎన్నికల్లో పొత్తుతో వెళ్లాలా.. విడిగా పోటీచేయాలా ఇంకా నిర్ణయానికి రాలేదు. పొత్తుల వ్యవహారం కొలిక్కి రావడంతో ప్రధాన యూనియన్లు ప్రచార పర్వంపై దృష్టి సారించాయి. రీజియన్‌ పరిధిలోని డిపోల వారీగా ప్రచారం నిర్వహించి, గరిష్టంగా ఓట్లు సాధించడం ద్వారా గుర్తింపు పొందడమే కాకుండా, రాష్ట్ర స్థాయిలోనూ తమ యూనియన్ల బలాన్ని చాటాలని నేతలు సిద్ధమవుతున్నారు.

తేలనున్న ఓటర్ల లెక్క

నేతలు తమ వ్యూహాల్లో ఉండగా.. మరోవైపు అధికారులు ఎన్నికల నిర్వహణ ప్రక్రియను వేగవంతం చేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి, గురువారం కార్మిక సంఘాల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. ఎన్నికల డిప్యూటీ రిటర్నింగ్‌ అధికారి, లేబర్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎం.కోటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. ఈమేరకు అందిన అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం అనంతరం శుక్రవారం ఓటర్ల తుది జాబితా ప్రకటించనుండడంతో ప్రచారం జోరందుకుంటుంది.

రాష్ట్రస్థాయిలో ఈయూ, ఎన్‌ఎంయూ మధ్య పొత్తు నేపథ్యాన వరంగల్‌, ఖమ్మం జిల్లాలను ఎన్‌ఎంయూకు కేటాయించారని.. మిగతా జిల్లాల్లో ఈయూ పోటీ చేస్తుందని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాటి అప్పారావు తెలిపారు. ఈమేరకు ఇక్కడ ఎన్‌ఎంయూ విజయానికి ఈయూ కార్యకర్తలు పనిచేయాలని కోరారు. ఖమ్మంలోని సీపీఐ కార్యాలయంలో ఈయూ కార్యకర్తల సమావేశం రీజియన్‌ కార్యదర్శి పిల్లి రమేష్‌ అధ్యక్షతన జరగగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈయూ, ఎన్‌ఎంయూ కలిసి బలమైన స్థానం సాధించేలా ఎన్నికల కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎంప్లాయీస్‌ యూనియన్‌ బస్సు గుర్తుకు, వరంగల్‌, ఖమ్మం రీజియన్లలో ఎన్‌ఎంయూ కాగడా గర్తుకు ఓటు వేయాలని కోరారు. నాయకులు కె.భాస్కర్‌, ఎంఆర్‌సీ.రావు, అరుణకుమారి, దండి సురేష్‌ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement