భద్రాచలంటౌన్: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5నుంచి 9వ తరగతి వరకు, జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఖాళీల భర్తీకి ఈనెల 26న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. అర్హత కలిగిన గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు ఉదయం 10గంటలకు ప్రవేశం కోరుకునే పాఠశాల, కళాశాలలో ఒరిజి నల్ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, రెండు సెట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు. బాలు రకు దమ్మపేట, కిన్నెరసాని, గుండాల, సింగరేణి, తిరుమలాయపాలెం, కృష్ణసాగర్ గురుకులాల్లో, బాలికలకు భద్రాచలం, సుదిమళ్ల, మణుగూరు, కొత్తగూడెం, వైరా, అంకంపాలెం, అన్నపురెడ్డిపల్లి కళాశాలల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
రూ.12 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు
వైరా: ఉమ్మడి జిల్లాలో గత రెండు రోజులుగా మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఈమేరకు వైరాలోని ఐఎంఎల్ మద్యం డిపో నుంచి రూ.12 కోట్ల విలువైన మద్యాన్ని బార్లు, వైన్స్‌లకు తీసుకెళ్లారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా బుధ, గురువారాల్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ప్రాంతాల వారీగా మద్యం అమ్మకాలు నిలిపివేశారు. దీంతో ముందుగానే దుకాణదారులు స్టాక్ కొనుగోలు చేసి తీసుకెళ్లారు. మణుగూరు, అశ్వారావుపేట ప్రాంతాల వైన్స్‌కు ఒకేరోజు రూ.70 లక్షల మద్యం తీసుకెళ్లగా, ఖమ్మం జిల్లాలో రూ.7 కోట్ల మేర మద్యం తరలించినట్లు తెలిసింది.
‘చేయూత’ పరిశీలన గడువు పొడిగింపు
ఖమ్మంమయూరిసెంటర్: ‘చేయూత’ పెన్షన్ల కోసం అందిన దరఖాస్తుల పరిశీలన గడువును ప్రభుత్వం పొడిగించింది. తొలుత 25వ తేదీ వరకే పరిశీలించాలని ఆదేశించగా.. దీన్ని 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఇంకా 8వేల దరఖాస్తులు పరిశీలించాల్సి ఉన్నందున, గడువు పొడిగించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్లకు అవార్డులు
ఖమ్మం రాపర్తినగర్: జిల్లా ఎన్‌ఎస్‌ఎస్(జాతీయ సేవా పథకం) కోఆర్డినేటర్లుగా విధులు నిర్వర్తించిన అధ్యాపకులకు అవార్డులు లభించాయి. గతంలో ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా కోఆర్డినేటర్లకు నిర్వర్తించిన వారితో పాటు ప్రస్తుత కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.శ్రీనివాసరావును కాకతీయ యూనివర్సిటీలో గురువారం జరిగిన గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో వీసీ ప్రతాప్‌రెడ్డి సన్మానించారు. ఇంకా ప్రొఫెసర్ ఎనిక వెంకటేశ్వర్లు, సీహెచ్.జగదీశ్వరరావు, సీహెచ్.వీరభద్రం, పి.సర్వేశరరావు, గడ్డమనుగు రామారావు కూడా సన్మానం అందుకోగా పలువురు అభినందించారు.
రెడ్‌క్రాస్ ఎన్నికల్లో
41 నామినేషన్ల దాఖలు
ఖమ్మం సహకారనగర్: రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా మేనేజింగ్ కమిటీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్లు స్వీకరించారు. ఈమేరక ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి ఏ.శ్రీనివాస్ తెలిపారు. దాఖలైన నామినేషన్లు శుక్రవారం పరిశీలిస్తామని, శనివారం ఉపసంహరణ గడువు ముగిశాక అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు పోటీలో మిగిలిన అభ్యర్థుల జాబితా వెల్లడిస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ 4వ తేదీన టీటీడీసీ భవనంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఒకేసారి ఏడుగురు ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీ
పెనుబల్లి: పెనుబల్లి మండలం అడవిమల్లెల గురుకుల పాఠశాలలోని ఉపాధ్యాయ, ఉద్యో గులు ఏడుగురిని ఏకకాలంలో డిప్యూటేషన్‌పై బదిలీ చేస్తూ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అడవిమల్లెల గురుకులం నిర్వహణపై ఆరోపణలు రావడం, ఉపాధ్యాయుల మధ్య విబేధాలు ఉన్నాయనే ఫిర్యాదుతో గురుకులాల జోనల్ అధికారి విచారణ చేపట్టి ఇచ్చిన నివేదికతో ఈ చర్యలు తీసుకున్నారు. గణితం, ఫిజిక్స్, బయోసైన్స్ ఉపాధ్యాయులతో పాటు పీఈటీ, లైబ్రేరియన్, హెల్త్ సూపర్‌వైజర్, మ్యూజిక్ విభాగాల ఉద్యోగులను వివిధ జిల్లాల గురుకులాలకు డిప్యూటేషన్‌పై కేటాయించారు.


