● సందర్శనకు వెళ్లిన బీఆర్‌ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు ● ఆందోళనలో పార్టీ పార్లమెంటరీ నేత వద్దిరాజు, మాజీ మంత్రి అజయ్
పాల్వంచ/మణుగూరు టౌన్: భద్రాద్రి జిల్లాలోని కేటీపీఎస్, బీటీపీఎస్ ప్లాంట్ల వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. ప్లాంట్ల సందర్శనకు వచ్చిన బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. లోపలకు అనుమతించకపోవడంతో నాయకులు నిరసన తెలిపారు. పోలీసులను నెట్టుకుంటూ లోపలకు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తోందని, పాలకులు పర్సంటేజీల కోసం కుంభకోణాలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. పాల్వంచలో కేటీపీఎస్ 7వ దశ సందర్శనకు వచ్చిన బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను పోలీసులు అడ్డుకోగా తోపులాట జరిగింది. బీఆర్‌ఎస్ పార్లమెంటరీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు తదితరులను ప్లాంట్ వద్దకు వస్తుండగా కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్‌లోనే నిలిపివేశారు. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు పోలీసులను కొంతదూరం నెట్టుకుంటూ వెళ్లారు. తోపులాటలో 7వ డివిజన్ కార్పొరేటర్ సింధుతపస్వీ కింద పడగా చేతికి గాయమైంది. రవిచంద్ర, వనమా, మెచ్చాలను మాత్రమే ప్లాంట్‌లోకి అనుమతించగా వారు చీఫ్ ఇంజనీర్ శివరామ్ రెడ్డితో సమావేశమై మాట్లాడారు. బొగ్గు నిల్వలను పరిశీలించారు. నాయకులందరినీ అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడే బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఇక మణుగూరులోని బీటీపీఎస్ ప్లాంట్‌ను సందర్శించేందుకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే రేగా నాయకులతో కలిసి రాగా పోలీసులు అడ్డుకున్నారు. ముగ్గురినే అనుమతిస్తామని అధికారులు చెప్పడంతో గేటు వద్ద ధర్నా నిర్వహించారు.


