ఖమ్మం సహకారనగర్/ఖమ్మం వ్యవసాయం: అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యాన ఆపదలో ఉన్న ప్రజలు సమాచారం ఇచ్చేలా కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలవారితో పాటు వాగులు, వంకలు ఉప్పొంగడం, ఇతర ఇబ్బందులు తలెత్తితే తక్షణ సాయం కోసం కంట్రోల్ రూమ్‌లో సంప్రదించే వెసలుబాటు కల్పించారు. ఇక్కడ 24గంటల పాటు మూడు షిఫ్ట్‌ల్లో ఉద్యోగులు అందుబాటులో ఉంటారని అధికారులు తెలిపారు. ఇక విద్యుత్ అంతరాయాలను తెలుసుకునేందుకు ఎస్‌ఈ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యుత్ సమస్యలు ఎదురైతే 87124 83490 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయొచ్చని అధికారులు తెలిపారు.
విద్యుత్‌తో జాగ్రత్త
జిలాల్లో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండగా, మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనేపథ్యాన కొణిజర్ల మండలం చిన్నమునగాలలో ఎర్త్ వైర్‌కు విద్యుత్ సరఫరా అయి, దానిపై మూత పట్టుకుని తొమ్మిది నెలల బాలుడు మృతి చెందాడు. ప్రస్తుత తరుణంలో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశమున్నందున వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులకు ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి పలు సూచనలు చేశారు. తడిసిన విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను, తడి గోడలకు ఆనుకుని ఉన్న విద్యుత్ పరికరాలను ముట్టుకోవద్దని తెలిపారు. తెగిపోయిన, వేలాడుతున్న తీగలకు వద్దకు వెళ్లొద్దని, తడి చేతులతో స్విచ్‌లు, ప్లగ్‌లు, మోటార్లు, గీజర్లను తాకొద్దని, బట్టలు ఆరేసేందుకు ఇనుప తీగలకు బదులు ప్లాస్టిక్ వైర్లు వాడాలని సూచించారు. రైతులు మోటార్లు ఆన్ చేసే ముందు వైర్లు, స్టార్టర్ సరిగా ఉన్నాయో, లేదో సరిచూసుకోవాలని తెలిపారు. షాక్‌కు గురైన వారిని నేరుగా తాకకుండా కర్రతో పక్కకు నెట్టి వైద్య సాయం అందించాలని వెల్లడించారు.


