● ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు... పరారీలో ఇంకో ఇద్దరు ● నగల దుకాణాల్లో దోపిడీ యత్నాల్లో కారు చోరీ ● అది మొరాయించడంతో వదిలేసి వెళ్లిన నిందితులు
గచ్చిబౌలి: క్యాబ్ అద్దెకు తీసుకొని డ్రైవర్‌ను హతమార్చి మృతదేహాన్ని పడేసి కారుతో ఉడాయించిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ బుధవారం గచ్చిబౌలిలో వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన నేలమర్రి రాజశేఖర్ తన రెండు కార్లను ఓ కంపెనీలో అద్దెకు పెట్టారు. ఆపై తన స్నేహితుడి కారు నడిస్తున్నాడు. ఈనెల 10న తెల్లవారుజామున 3–30 గంటలకు సికింద్రాబాద్ వద్ద ఐదుగురు ఆయనను సంప్రదించి ఓల్డ్ ముంబై రోడ్డుకు చేర్చేలా అద్దెకు మాట్లాడుకున్నారు. ఐదుగురు ఎక్కాక కాసేపటికే ఓ వ్యక్తి కాలకృత్యాలు తీసుకుంటానని కారు దిగగా వెనకాల కూర్చున్న వారు టవల్ రాజశేఖర్ మెడకు బిగించి అంతమొందించాడు. ఆపై జాతీయ రహదారి–65పై వెళ్తూ రుద్రారంలోని ఓవర్ బ్రిడ్జి సమీపాన మృతదేహాన్ని పడేశారు. అయితే, కోహీర్‌లోని గోల్డెన్ దాబా సమీపాన కారు మొరాయించడంతో వదిలి తమ సొంత ఊర్లకు వెళ్లిపోయారు. ఈమేరకు మృతదేహంతో పాటు కారు స్వాధీనం చేసున్న సైబరాబాద్ ఎస్‌ఓటీ, ఆర్సీపురం డివిజన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పట్టుబడిన ముగ్గురు
సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. ఈమేరకు మహారాష్ట్రకు చెందిన ఘోడకే రాహుల్, సూరజ్ శశికాంత్ దవాడే, బాంబ్లే రాజు రామచంద్రను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉండగా, వారి వద్ద మృతుడి సెల్‌ఫోన్ ఉందని గుర్తించారు.
నగల దుకాణాల్లో చోరీకి ప్లాన్
మహారాష్ట్రకు చెందిన ఘోడాకే రాహుల్ క్లినికల్ ట్రయల్స్ కోసం హైదరాబాద్ వస్తుంటాడు. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన మరో వ్యక్తి పరిచయమయ్యాడు. వీరిద్దరు సికింద్రాబాద్ హోటల్‌లో ఉండగా మహారాష్ట్రకు చెందిన మరో ముగ్గురు పరిచయమయ్యారు. ఢిల్లీకి చెందిన వ్యక్తి క్యాబ్ దొంగిలించి ముంబై శివారు నగల దుకాణాల్లో దోపిడీ చేయొచ్చని చెప్పగా అంతా సిద్ధమవుతారు. ఈక్రమంలో రాజశేఖర్ క్యాబ్ అద్దెకు తీసుకొని హత్య చేసి చోరీకి బయలుదేరగా... కారు మొరాయించడంతో పారిపోయిన వారు పోలీసులకు పట్టుబడ్డారు. కారు ఆగిపోకుంటే ముంబై శివారు నగల దుకాణాలలో చోరీకి పాల్పడే వారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో మరో ఇద్దరు పట్టుబడితే కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఎస్‌ఓడీ డీసీసీ శోభన్ కుమార్, ఆర్సీపురం ఏసీపీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు రవీందర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


