ఖమ్మంగాంధీచౌక్: భక్తజన సందోహం నడుమ నృసింహుడి గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది. స్వామి వారి జన్మనక్షత్రం(స్వాతి నక్షత్రం) సందర్భంగా మంగళవారం ఖమ్మంలోని స్తంభాద్రి గుట్ట చుట్టూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. తొలుత ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి బయటకు తీసుకువచ్చి పల్లకీపై ఆసీనులను చేయించారు. ఆతర్వాత గుట్ట పైనుంచి కిందకు తీసుకువచ్చి నగర పుర వీధుల్లో ప్రదక్షిణ చేశారు. ఆతర్వాత గుట్టపైన ఆలయానికి చేర్చిన అర్చకులు అక్కడ రాతి కొండపై నక్షత్ర జ్యోతి వెలిగించారు. ఈఓ కె.జగన్మోహన్ రావు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో అర్చకులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎన్నెస్పీ క్యాంప్‌లో
ఇంజినీర్స్ డే
ఖమ్మంఅర్బన్: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజినీర్స్ డే వేడుకలను మంగళవారం ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంప్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఇంజనీర్లు, అధికారులు, విశ్రాంత ఇంజినీర్లు విశ్వేశ్వరయ్య విగ్రహం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. ఇంజినీరింగ్ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జలవనరుల శాఖ ఎస్‌ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, ఈఈ వెంకట్రామ్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యుగంధర్, రిటైర్డ్ ఇంజినీర్లు సత్యంబాబు, మధుసూదన్‌రావు, డీవీఎన్. చౌదరి, హన్మంతరావుతో పాటు వివిధ శాఖల డీఈలు, ఏఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.
రేక్ పాయింట్‌కు ఎరువులు
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు మంగళవారం కాంప్లెక్స్ ఎరువులు చేరాయి. ఇందులో 20–20–00–13 ఎరువులు 1,337.200 మెట్రిక్ టన్నులు, 24–24–0 ఎరువులు 1,178.95 మెట్రిక్ టన్నులు, 9–24–24 ఎరువులు 129 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు డీఏఓ ధనసరి పుల్లయ్య వెల్లడించారు. ఈ ఎరువులను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు కోటా వారీగా పంపిణీ చేయడమేకాక కొంతమేర బఫర్ స్టాక్‌గా నిల్వ చేసినట్లు తెలిపారు.
నేడు జిల్లా స్థాయి
సైన్స్ సెమినార్
ఖమ్మం సహకారనగర్: విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనాశక్తి, సృజనాత్మకతను వెలికితీసే లక్ష్యంతో బుధవారం జిల్లా స్థాయి నేషనల్ సైన్స్ సెమినార్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి సైన్స్ అధికారి తెలిపారు. ఈ పోటీల్లో విద్యార్థులు నూతన ఆవిష్కరణలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.
ఆదివాసీ అధ్యక్ష పదవికి దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్ష పదవికి ఆసక్తి కలిగిన ఎస్టీ నేతల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఈనెల 16న ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటల వరకు పార్టీ జిల్లా కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించన్నుట్లు పేర్కొన్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పని చేయాలనుకునే ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఖేలో ఇండియా
ఆర్చరీ పోటీలకు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: జాతీయ స్థాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా ఆర్చరీ పోటీలు ఖమ్మంలో జరగనున్నా యి. ఈ పోటీల్లో తెలంగాణ నుంచి పాల్గొనే క్రీడాకారులను ఎంపిక చేయగా, దమ్మపేట మండలం పట్వారీగూడెంకు చెందిన కె.లోహితకు స్థానం దక్కింది. ప్రస్తుతం ఆమె హాకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్‌లో శిక్షణ పొందుతోంది. రికర్వ్ ఈవెంట్‌లో ప్రతిభ కనబరిచిన ఆమెను పోటీలకు ఎంపిక చేశారు. ఆమెను ఆర్చరీ కమిటీ సభ్యుడు పుట్టా శంకరయ్య, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాదుల సారంగపాణి, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి అభినందించారు.


