నేలకొండపల్లి: ‘కాల్వలకు అవసరమైన నీటి సరఫరా చేయకుండా ఏం చేస్తున్నారు... విషయాన్ని కనీసం నా దృష్టికి తెచ్చారా... అందరూ బాధ్యత లేకుండా పని చేస్తున్నారు’ అంటూ జల వనరుల శాఖ అధికారులపై సీఈ వాసంతి మండిపడ్డారు. నేలకొండపల్లి మండలం మంగాపురం మేజర్ కాల్వకు నీరు రావడం లేదని గ్రామానికి చెందిన ధీరావత్ రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యాన రైతులు భూక్యా గోబ్రియా, శంకర్, నాగేశ్వరరావు తదితరులు మంగళవారం నిరసన తెలిపారు. రాజేశ్వరపురం వద్ద ప్రారంభమయ్యే నందిగామ బ్రాంచ్ నుంచి చెరువుమాధారం చెరువు నింపేందుకు నీరు విడుదల చేయగా, 15 కి.మీ. ప్రవహించాల్సి ఉంటుంది. కాల్వ సామర్థ్యం 980 క్యూసెక్కులైతే కేవలం 200 – 300 క్యూసెకులే విడుదల చేస్తుండడంతో మంగాపురం కాల్వకు ఇంకా చేరలేదు. ఇక చెరువుమాధారం, అప్పలనరసింహాపురం చెరువులకు చేరడానికి ఇంకా పది రోజులైనా పడుతుందని రైతులు పేర్కొన్నారు. అంతేకాక మేజర్ పరిధి 14, 26 కాల్వలకు కంట్రోలింగ్ షట్టర్లు లేక నీరు వృథా అవుతోందని ఖమ్మంలో సీఈ వాసంతికి వినతిపత్రం అందజేశారు. ఈక్రమాన స్పందించిన ఆమె మంగాపురం–19 మేజర్ కాల్వ పరిశీలనకు వచ్చారు. ‘మంగాపురం మేజర్‌కు ఎంత నీరు అందిస్తున్నారు.. ఎందుకు తక్కువ తీసుకున్నారు.. ఇబ్బందులు ఉన్న విషయాన్ని నాకెందుకు చెప్పలేదు.. నీటి సరఫరా పనులు వదిలేసి ఏం చేస్తున్నారు’ అంటూ అక్కడ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ‘ఎస్‌ఈ, డీఈలు పని చేయడం లేదు.. సెలవు దొరికితే వెళ్లిపోతున్నారు...’ అని పేర్కొన్నారు. ఇకపై మంగాపురం మేజర్‌కు 450, నందిగామ బ్రాంచ్ 16, 17 కెనాళ్లకు 800 క్యూసెకుల నీరు విడుదల చేయాలని సీఈ ఆదేశించారు. కల్లూరు ఎస్‌ఈ శ్రీకాంత్, నేలకొండపల్లి డీఈఈ పొట్టయ్య, ఏఈలు మనోజ్‌రెడ్డి, నరేష్, రుత్విక్‌రెడ్డి, మదీనా, పద్మరాజు, దీక్షిత తదితరులు పాల్గొన్నారు.
అధికారుల తీరుపై ఇరిగేషన్
సీఈ మండిపాటు


