నాణ్యమైన విద్య ప్రభుత్వాల బాధ్యతే.. | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్య ప్రభుత్వాల బాధ్యతే..

Sep 16 2026 4:07 AM | Updated on Sep 16 2026 4:07 AM

తెలంగాణ విద్యా కమిషన్‌

మాజీ చైర్మన్‌ మురళి

ఖమ్మంరూరల్‌/కొణిజర్ల: ప్రజలకు ఉచితంగా, నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని తెలంగాణ విద్యా కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఆకునూరి మురళి అన్నారు. తెలంగాణ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యాన చేపట్టిన బస్సుయాత్ర మంగళవారం సాయంత్రం ఖమ్మం జిల్లాకు చేరింది. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్‌ మండలం పోలేపల్లి పరిధి రాజీవ్‌ గృహకల్ప ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడగా ఆర్థిక స్తోమత లేకే ప్రభుత్వ బడికి పంపుతున్నామని తెలిపారు. ఇక్కడ 92మందితో ఐదు తరగతులు నిర్వహిస్తుండగా మూడే గదులు ఉన్నాయని చెప్పారు. మున్నేరు పొంగితే పాఠశాల మూతపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మురళి మాట్లాడుతూ పది జిల్లాల్లో పాఠశాలలను పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో పాటు లక్ష మంది తల్లిదండ్రులతో ప్రదర్శన చేసి సౌకర్యాల కల్పన కోసం ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. రోజూ ఒక్కో జిల్లాలో కొన్ని పాఠశాలలు సందర్శించి ఒక పాఠశాలలో రాత్రి బస చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, అన్ని సౌకర్యాలతో మండలానికి నాలుగు ఫౌండేషన్‌ స్కూళ్ల ఏర్పాటు, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం, ఏటా విద్యారంగానికి బడ్జెట్‌లో 18శాతం నిధులు కేటాయించాలనే డిమాండ్లతో ఈ యాత్ర చేపడుతున్నామని మురళి వెల్లడించారు. ఈ యాత్రలో మాజీ ఐఏఎస్‌ ఎం.చంపాలాల్‌, డాక్టర్‌ ఎం.వీ.రెడ్డి, ఓయూ ప్రొఫెసర్‌ పద్మజ, వివిధ వర్గాల ప్రముఖులు రుబీనా, నిర్మల, అశోక్‌ కుమార్‌, నిఖిల్‌, విజయ్‌, మణిభూషణాచారి, ఖలీల్‌, శంకరయ్య, విజయ్‌కృష్ణ, సృజన్‌యాదవ్‌, ఎన్‌.తిర్మల్‌, దండా లింగయ్య, విజయకుమార్‌, కనకయ్య పాల్గొన్నారు. కాగా, యాత్ర రాత్రి కొణిజర్ల మండలానికి చేరుకోగా, ఇక్కడి ఎల్లన్ననగర్‌ పాఠశాలలో స్థానికులతో మాట్లాడాక రాత్రి బస చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement