రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Sep 17 2026 12:08 AM | Updated on Sep 17 2026 12:08 AM

ముదిగొండ: ముదిగొండ మండలం మేడేపల్లి సాగర్‌ కాల్వ వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన పేరం పార్వతి(50) తన మేనల్లుడు వీరబాబు ద్విచక్రవాహనంపై కూసుమంచి మండలం నాయక్‌గూడెం నుంచి వస్తోంది. ఈక్రమాన మేడేపల్లి సాగర్‌ కాల్వ వద్ద ద్విచక్రవాహనంపై పార్వతి కిందపడడంతో తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త పుల్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు

చికిత్స పొందుతున్న వృద్ధుడు...

తిరుమలాయపాలెం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని మహ్మదాపురం శివారు బోడతండాకు చెందిన బోడ మదార్‌(75) ఈనెల 14న పొలం వద్ద రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా సుబ్లేడు క్రాస్‌ వద్ద పల్సర్‌ బైక్‌ అతివేగంగా ఢీకొట్టింది. ఘటనలో మదార్‌కు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబీకులు ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఆయనకు భార్య దుబ్లీ, ఇద్దరు కుమారులు ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

బాలిక మృతదేహంతో ఆందోళన

ఖమ్మం అర్బన్‌: ప్రేమ పేరిట వేధింపులు తట్టుకోలేక ఓ బాలిక ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం బుధవారం రాత్రి ఖమ్మం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మృతదేహంతో టేకులపల్లి వద్ద సాగర్‌ కాల్వ వంతెనపై ఆందోళనకు దిగారు. వేధింపులకు గురిచేసిన ఇద్దరిపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో సాగర్‌ కాల్వ వంతెన బైపాస్‌ రోడ్డు వద్ద ఉద్రిక్తత నెలకొనగా ఖమ్మం అర్బన్‌ సీఐ భానుప్రకాశ్‌, సిబ్బంది చేరుకుని నచ్చచెబుతున్నారు.

కొండముచ్చుల దాడిలో ఇద్దరికి గాయాలు

కల్లూరురూరల్‌: కల్లూరులో బుధవారం కొండముచ్చులు దాడి చేయగా ఇద్దరికి గాయాలయ్యాయి. కల్లూరు మెయిన్‌ సెంటర్‌ మీదుగా వెళ్తున్న బొల్లం వెంకటేశ్వరరావు, హరిపై దాడి చేసిన కొండముచ్చులు గోళ్లతో రక్కి తీవ్రంగా గాయపరిచాయి. వీరిని స్థానికులు ప్రభుత్వ ఆస్పపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. మున్సిపల్‌ అధికారులు స్పందించి కొండముచ్చుల ఆగడాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

చెల్లని చెక్కు కేసులో రెండేళ్ల జైలుశిక్ష

ఖమ్మం లీగల్‌: ఖమ్మంశ్రీరాంనగర్‌కు చెందిన షేక్‌ జానీమియా వద్ద మామిళ్లగూడెంకు చెందిన టి.సునంద 2013 డిసెంబర్‌లో రూ.2.50లక్షల అప్పు తీసుకుంది. తిరిగి 2015 ఆగస్టులో రూ.3.50లక్షలకు చెక్కు ఇచ్చినా ఆమె ఖాతాలో సరిపగా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో జానీమియా తన న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీస్‌ జారీ చేసి కోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు చేశాడు. సాక్షులను విచారించాక నేరం బుజువు కావడంతో సునందకు రెండేళ్ల శిక్ష విధించడమేకాక ఫిర్యాదికి రూ.6.90లక్షలు చెల్లించాలని, రూ.10వేల జరిమాన కట్టాలని ఖమ్మం మూడో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి అరవ ప్రవీణ్‌ బుధవారం తీర్పు చెప్పారు.

మరొకరికి ఆరు నెలలు..

ఖమ్మం ద్వారకానగర్‌కు తోట లింగయ్య వద్ద అదే ప్రాంతానికి చెందిన బి.శైలు 2018 జూలైలో రూ.3లక్షల అప్పు తీసుకుంది. తిరిగి 2019 డిసెంబర్‌లో రూ. 3.90లక్షలకు చెక్కు ఇచ్చిన చెల్లలేదు. దీంతో లింగయ్య దాఖలు చేసిన కేసును విచారించాక శైలుకు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కాకుమాని జ్యోతిర్మయి తీర్పు చెప్పారు. అంతేకాక ఫిర్యాదికి రూ.6.25వేలు చెల్లించాలని తీర్పులో పేర్కొనగా రూ.5వేల జరిమానా కూడా విధించారు.

అత్యాచారయత్నం కేసులో ఏడాది..

వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడిన సత్తుపల్లి రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన జల్లి సురేష్‌కు ఏడాది జెలుశిక్షతో పాటు రూ.6వేల జరిమానా విధిస్తూ ఖమ్మం ఐదో అదనపు జిల్లా ప్రత్యేక మహిళా కోర్టు న్యాయమూర్తి వి.సీనయ్య తీర్పు చెప్పారు. సత్తుపల్లికే చెందిన వివాహితతో 2015 మార్చి 10న సురేష్‌ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో విచారణ అనంతరం కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయగా సాక్షులను విచారించాక న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పబ్లిక్‌ పాస్రిక్యూటర్‌ ఆర్‌.ఉపేందర్‌ వాదించగా ఉద్యోగులుకె.శ్రీకాంత్‌, ఎం.డీ.యూసఫ్‌ సహకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement