ఖమ్మంగాంధీచౌక్: బీసీల హక్కుల సాధన రాజకీయ నినాదంగా మిగలకుండా, సామాజిక దృక్పథంగా, సాంస్కృతిక ఉద్యమంగా రూపుదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. బీసీ కవులు, రచయితలు, కళాకారులు, విద్యావంతులు, మేధావులు ఒక వేదికపైకి వచ్చి ‘బీసీ లిటరరీ డిక్లరేషన్ – సాహిత్య ప్రకటన’ రూపొందించాలని పేర్కొన్నారు. ‘వెంటాడే కలాలు – వెనుకబడిన కులాలు’ వెలువడి పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 20న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రజతోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈమేరకు పోస్టర్లను బుధవారం ఖమ్మంలో ఆవిష్కరించాక ఆయన మాట్లాడారు. ఈ రజతోత్సవం బీసీ సాహిత్యం, సామాజిక ఉద్యమం ఎటువైపు ప్రయాణించాలో నిర్ణయించుకునే ఆలోచనా వేదిక అని తెలిపారు. సమాజ నిర్మాణంలో బీసీ సమూహాలు అందించిన పాత్రను సాహిత్యం తిరిగి వెలికితీయాల్సిన అవసరముందని చెప్పారు. కవులు, కళాకారులు, వివిధ వర్గాల ప్రతినిధులు ప్రసేన్, సీతారాం, రంగరాజు, శంకర్, రమేష్‌కుమార్ ధరణికోట, ఎం.వీ.రమణ, ఉరిమళ్ల సునంద, సురేష్, ఆంజనేయులు పాల్గొన్నారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ
మాజీ చైర్మన్ గౌరీశంకర్


