ఇళ్లు ఇచ్చి.. ఇప్పుడు కూల్చేస్తారా? | - | Sakshi
Sakshi News home page

ఇళ్లు ఇచ్చి.. ఇప్పుడు కూల్చేస్తారా?

Sep 17 2026 12:08 AM | Updated on Sep 17 2026 12:08 AM

శ్రీనివాసనగర్‌లో స్థానికుల ఆందోళన

ఖమ్మంమయూరిసెంటర్‌: స్థలాల పట్టాలు ఇవ్వడమే కాక ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ప్రభుత్వమే తమ ఇళ్లను కూల్చాలని నోటీసులు ఇస్తుందా అంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఖమ్మం త్రీటౌన్‌ ప్రాంతం శ్రీనివాసనగర్‌లో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్ల తొలగింపుపై కేఎంసీ అధికారులు ఇవ్వడంతో స్థానికులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈమేరకు శ్రీనివాసనగర్‌ ఆర్‌ఓబీ రోడ్డుపై బైఠాయించారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమకు గత ప్రభుత్వంలో 58 జీఓ కింద పట్టాలు ఇచ్చారని, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఈమేరకు అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని, సమస్య కోర్టులో ఉన్నందున తదుపరి ఆదేశాలు వచ్చే వరకు శాంతియుతంగా ఉండాలని సూచించడంతో ఆందోళన విరమింపజేశారు. కానీ కాసేపటికి మళ్లీ స్థానికులు ఆందోళనకు దిగడంతో బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు చేరుకుని మద్దతు తెలిపారు. దీంతో మరోమారు అదనపు కలెక్టర్‌ వచ్చి నచ్చచెప్పారు. కాగా, శ్రీనివాసనగర్‌లో నిరుపేదల ఇళ్లను ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంపై సీపీఎం ఆధ్వర్యాన కుటుంబాలతో కలిసి ఉదయం కలెక్టరేట్‌ వద్ద ధర్నాచౌక్‌లో ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ దివాకరకు వినతిపత్రం ఇవ్వగా, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడారు. నాయకులు వై.విక్రమ్‌, యర్రా శ్రీనివాసరావు, బొంతు రాంబాబు, మెరుగు సత్యనారాయణ, ఎస్‌.కే.సైదులు, భూక్యా శ్రీనివాసరావు, బండారు రమేష్‌, దొంగల తిరుపతిరావు, ఎం.ఏ.జబ్బార్‌, ఎస్‌.కే.నాగులు మీరా తదితరులు పాల్గొన్నారు.

కూల్చివేతలే కాంగ్రెస్‌ అజెండా

ఖమ్మం వైరారోడ్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వానికి విధ్వంసం, కూల్చివేతలు తప్ప మరో అజెండా లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ విమర్శించారు. ఖమ్మం శ్రీనివాస్‌నగర్‌ ప్రాంతంలోని ఇళ్ల కూల్చివేతకు నోటీసులపై ఆయన ప్రకటన విడుదల చేశారు. పేదల ఇళ్లను కూల్చివేయాలనుకునే ఆలోచనను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విరమించుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement