విచారణలో 11 పత్రాల్లో
ఒకటి సమర్పిస్తే చాలు
అక్షరదోషాలు, మ్యాపింగ్ సమస్యను పరిష్కరిస్తాం
పేరు సవరణల కోసం
ఫామ్–8 ద్వారా దరఖాస్తు
జనరల్ ఆస్పత్రిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టితో సేవలు మెరుగుపడుతుండగా, త్వరలోనే ఎంఆర్‌ఐ అందుబాటులోకి రానుంది.
శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
ఓటర్లు ఆందోళన చెందొద్దు
ప్రశ్న : నా ఓటరు ఐడీలో మా నాన్న పేరు, నా పేరు ఒకటే ఉంది. అన్ని వివరాలు సమర్పించినా ఇప్పుడు నోటీసు ఇచ్చి 18న విచారణకు హాజరు కావాలని చెప్పారు.
– గుడిపల్లి జ్యోత్స్న, తల్లాడ
జవాబు : మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నిర్ణీత తేదీన పదో తరగతి సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం ఏది ఉన్నా తీసుకుని మీ నాన్నతో కలిసి వెళ్లండి. సమస్య పరిష్కారం అవుతుంది. మ్యాపింగ్ కరెక్ట్‌గా ఉంటే పరిష్కరిస్తారు.
‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో కలెక్టర్ దివాకర టీ.ఎస్.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో నోటీసులు అందుకునే ఓటర్లు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ దివాకర టీ.ఎస్. స్పష్టం చేశారు. ‘సర్’పై ఓటర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యాన నిర్వహించిన ఫోన్ ఇన్‌లో ఓటర్ల సందేహాలకు కలెక్టర్ సమాధానాలు ఇచ్చారు. అక్షర దోషాలు, వయసు లేదా పేర్లలో వ్యత్యాసాలను సిస్టమ్ ‘ఫ్లాగ్’ చేయడంతో నోటీసులు జారీ అవుతున్నాయని తెలిపారు. చాలావరకు సమస్యలను అధికారుల స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పారు. అయితే, నోటీసులు అందుకున్న వారు నిర్ణీత తేదీన 11 రకాల ఆమోదిత పత్రాల్లో ఒకటి సమర్పించేలా విచారణకు కచ్చితంగా హాజరు కావాలని, తద్వారా ఓటు కోల్పోకుండా తప్పులు సరిచేసే వీలుంటుందని తెలిపారు. ధ్రువీకరణ పత్రాలు లేనివారు తహసీల్‌లో దరఖాస్తు చేసుకుంటే రెండు, మూడు రోజుల్లో ఇచ్చేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. నోటీసులు అందుకున్న వారు కేటాయించిన తేదీలో విచారణకు రాకున్నా, పత్రాలు సమర్పించలేకపోయినా రీ–షెడ్యూల్ ద్వారా మరో అవకాశం కల్పిస్తామని కలెక్టర్ వెల్లడించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 7వరకు క్లయిమ్‌లు, అభ్యంతరాల గడువు ఉండగా, తుది ఓటరు జాబితా నవంబర్ 9న విడుదలవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్ల సందేహాలు, కలెక్టర్ ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి.
ప్ర : మాది ఖమ్మంలోని 50వ డివిజన్. సర్‌లో అన్ని పత్రాలు ఇచ్చిన నోటీసు వచ్చింది. మా నాన్నగారి సర్టిఫికెట్ కావాలంటే ఇచ్చినా రిజెక్ట్ అయింది. ఆరా తీస్తే మా అమ్మ సర్టిఫికెట్ కావాలంటున్నారు. వాళ్లు ఎప్పుడో చనిపోయినందున ఏంచేయాలో అర్థంకా వడం లేదు. – యాకూబ్‌పాష, బుర్హాన్‌పురం, ఖమ్మం
జ : మీకు ఇచ్చిన నోటీసులోని తేదీ, వేదిక ఆధారంగా అక్కడికి వెళ్లి సమస్యను వివరించండి. మీ తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారంటున్నారు. విచారణ అధికారికి నేను చెబుతాను.
ప్ర : మా వివరాలన్నీ సక్రమంగానే ఉన్నా, మా కుటుంబసభ్యుల ఓట్లు నాలుగైదు డివిజన్లలోకి మారాయి. మీసేవ సెంటర్‌కు వెళ్తే బూత్ నంబర్ ఆప్షన్ లేదన్నారు.
– చిరుమామిళ్ల నాగేశ్వరరావు, రాధాకృష్ణ నగర్, ఖమ్మం
జ : ఒకే కుటుంబంలోని సభ్యుల ఓట్లు వేర్వేరు డివిజన్లలోకి వెళ్తే.. పోలింగ్ స్టేషన్ పరిధిలోకి ఓటు మార్చుకునేలా దరఖాస్తు చేసుకోండి. ఎస్‌ఐఆర్ ముగిశాక ఫామ్–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్ర : కూసుమంచిలో నివాసం ఉంటే చలమయ్య కుటుంబానికి పాలేరులో ఓట్లు ఉన్నాయి. బీఎల్‌ఓ అడిగినప్పుడు కూసుమంచిలో ఓట్లు కావాలని చెప్పారట. కానీ ఇ ప్పుడు రెండు చోట్ల లేకుండాపోయాయి.
– గుండా ఉపేందర్‌రెడ్డి, కూసుమంచి
జ : బీఎల్‌ఓకు వారు ఏం చెప్పారో తెలుసుకోండి. కూసుమంచిలో ఓటు కావాలంటే ఫామ్–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ సమయాన మరెక్కడా ఓట్లు లేవని డిక్లరేషన్ ఇవ్వాలి.
ప్ర : రెండు చోట్ల ఓట్లు ఉంటే ఓచోట ఆటోమేటిక్‌గా ఓటు తీసేస్తారా? మా సోదరుడు వేరే ప్రాంతంలో ఉంటూ అక్కడ ఓటు ఉండి ముజ్జుగూడెంలోనే కొనసాగితే రెండో ప్రాంతంలో తీసేస్తారా?
– కె.నరేష్, ముజ్జుగూడెం, నేలకొండపల్లి
జ : ఓటు హక్కు ఉన్నచోటల్లా ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. మీకు ఓటు కావాల్సి న చోటే ఎన్యుమరేషన్ ఫామ్ ఇస్తే కొనసాగుతుంది. అవసరం లేని చోట ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వకపోతే అక్కడి ఓటు డిలీట్ అవుతుంది.
ప్ర : ఏజ్ ప్రెగ్నెన్సీ గ్యాప్ అని నోటీస్ ఇచ్చారు. మా నాన్న బర్త్ సర్టిఫికెట్లు, కమ్యూనిటీ సర్టిఫికెట్లు బీఎల్‌ఓకు ఇస్తే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. డాక్యుమెంట్లు సక్రమంగా అప్‌లోడ్ చేశారా, లేదా తెలుసుకోవచ్చా?
– రత్నబాబు, ఖమ్మం
జ : మీరు విచారణ కు వెళ్లినప్పుడు మీది, పత్రాల ఫొటో తీసుకు ని అప్‌లోడ్ చేస్తారు. ఇప్పటికే అప్‌లోడ్ చేసి ఉంటే మీరు చూసుకోవచ్చు. వివరాలు సక్రమంగానే చేస్తారు. సందేహాలుంటే ఏఈఆర్‌ఓను అడగండి.
ప్ర : నోటీసు వచ్చాక పత్రాలు సమర్పించాం. ఆ పత్రాలు సరైనవే అయినా పేర్లు తొలగించే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ అలా జరిగితే అప్పీల్ చేసుకోవచ్చా?
– బి.గణేష్‌రెడ్డి, సత్తుపల్లి
జ : అప్పీల్ చేసుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది. మీకేమైనా తప్పు జరిగిందనిపిస్తే డీఈఓ(డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్)కు అప్పీల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా న్యాయం జరగలేదనుకుంటే సీఈఓ (చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్)కు సైతం అప్పీల్ పెట్టుకోవచ్చు.
ప్ర : హెవీ వాటర్ ప్లాంట్‌లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన నాకు నోటీసులు రావడంతో గురువారం విచారణకు హాజరయ్యా. కానీ రీచ్ కావడం లేదంటూ మరోసారి రావాల్సి ఉంటుందని చెప్పారు.
– మురళీకృష్ణ, నాయుడుపేట, ఏదులాపురం మున్సిపాలిటీ
జ : మీరు వివరాలన్నీ ఇచ్చామని చెబుతున్నారు. సాంకేతిక పరమైన ఇబ్బందితో అలా జరిగి ఉంటుంది. అది ఓకే అయితే ఫర్వాలేదు. లేకపోతే మరోసారి విచారణకు పిలుస్తాం.
ప్ర : విచారణలో తల్లిదండ్రుల సర్టిఫికెట్లు అడుగుతున్నారు. కొందరి వద్ద ఆ సర్టిఫికెట్లు లేవు. ఒకే ఇంట్లో నాలుగైదు ఓట్లు ఉంటే బూత్‌లు వేరేగా ఉంటున్నా యి. – శీలంశెట్టి వీరభద్రం, బుర్హాన్‌పురం, ఖమ్మం
జ : తల్లిదండ్రులకు ఎలాంటి సర్టిఫికెట్లు లేకపోతే తహసీల్‌లో దరఖాస్తు చేసుకోండి. గత నాలుగు నెలల నుంచి ఇదే విషయం చెబుతున్నాం. ఎస్‌ఐఆర్ గడువు కూడా పెంచాం. విచారణకు హాజరయ్యేందుకు రెండుసార్లు అవకాశం కల్పించాం. ఒకే ఇంటి కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే బూత్‌లోకి రావడానికి ఫామ్–8లో షిఫ్టింగ్ పెట్టుకోవాలి. అలాగే ఎడిట్ పెట్టుకోవాలి.
ప్ర : మా దగ్గర ఉన్న 200 మంది ఓట్లు పెనుబల్లి పరిధిలోకి వెళ్లాయి. అలాగే అక్కడి ఓట్లు కూడా వీఎం బంజరలోకి వచ్చాయి.
– భూక్యా ప్రసాద్, సర్పంచ్, వీ.ఎం.బంజర
జ : దీనిపై విచారణ చేయిస్తా. అక్కడికి అధికారులను పంపించి ఏం జరిగిందో తెలుసుకుంటాం.
ప్ర : మా నాన్న పేరు మహ్మద్ అబ్దుల్ సత్తార్ అయితే పొరపాటున షేక్ అని వచ్చింది. అలాగే నాది, మా సోదరుడి పుట్టిన సంవత్సరం ఒకటే కావడం, సోదరుడి తండ్రి ఇంటి పేరు వద్ద మహ్మద్ అని ఉండడంతో నోటీసు ఇచ్చారు.
– షేక్ సద్దాం, బల్లేపల్లి, 3వ డివిజన్, ఖమ్మం కార్పొరేషన్
జ : మీ పదో తరగతి సర్టిఫికెట్ లేనందున బీసీ సర్టిఫికెట్, తల్లిదండ్రుల బీసీ సర్టిఫికెట్‌తో విచారణకు వెళ్లండి. సర్టిఫికెట్ లేకపోతే తహసీల్‌లో దరఖాస్తు చేసుకుని అది ఇస్తే సరిపోతుంది. ఇంటి పేరు షేక్ నుంచి మహ్మద్‌కు మారడానికి తర్వాత ఫామ్–8 ఇవ్వండి.
ప్ర : చాలామందితో మేము ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపించాం. బీఎల్‌ఓలు కొన్ని ఫామ్స్ నింపే సమయాన తప్పులు చేయడంతో కొందరికి నోటీసులు వచ్చాయి. ఒక్కో బూత్ నుంచి చాలామందికి నోటీసులొచ్చాయి.
– ఆరెంపుల వీరభద్రం, రాపర్తినగర్, ఖమ్మం
జ : విచారణ సమయంలో మీరు చేసింది తప్పా, ఒప్పా.. అని చూడడమే కాక బీఎల్‌ఓ దగ్గర జరిగిందని తెలిసినా సవరిస్తారు. నోటీసులు వచ్చిన వారందరినీ విచారణకు వెళ్లమని చెప్పండి. గడువు పొడిగించినందున విచారణ అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు
ఉంటున్నారు.


