ఖమ్మంమయూరిసెంటర్: బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల దళిత వ్యతిరేక, మనువాద వైఖరిని అనుసరిస్తున్నాయని ఆరోపిస్తూ ఖమ్మంలో కాంగ్రెస్ ఆధ్వర్యాన ‘దళిత గర్జన’ పేరిట శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయం నుంచి జెడ్పీసెంటర్ వరకు ర్యాలీ సాగగా, అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, నాగండ్ల దీపక్‌చౌదరి మాట్లాడారు. ఉత్తరాఖండ్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పర్యటించిన ప్రదేశాన్ని బీజేపీ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి చేస్తే, ఎర్రవల్లి వద్ద దళితులు నిరసన తెలిపిన రహదారిని బీఆర్‌ఎస్ నేతలు పసుపు నీళ్లతో కడగడం దళితుల ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాత మధు శాసనమండలి సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా వైఖరి మార్చుకోని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వెంటే నిలుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహ్మద్ ఖాదర్ బాబా, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నాయకులు పులిపాటి వెంకయ్య, పట్టాభి, దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, బొడ్డు బొందయ్య, మొక్క శేఖర్ గౌడ్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, బచ్చలకూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం


