ఖమ్మంవ్యవసాయం: అటవీ సంరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు ఉద్యోగులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మంలోని అటవీ శాఖ జిల్లా కార్యాలయంలో స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు డాక్టర్ పి శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, పోలీసు కమిషనర్ సునీల్‌దత్, జిల్లా అటవీ అధికారి అనూజ్ అగర్వాల్ మాట్లాడుతూ అమరవీరుల ఆశయాలు, స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలు కూడా అటవీ శాఖకు సహకరించాలని కోరారు. అక్రమంగా చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణా, వన్యప్రాణుల వేట, ఇతర అటవీ నేరాలను అరికట్టడంలో భాగం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజన్ అటవీ అధికారి భవానీశంకర్, రేంజ్, డిప్యూటీ రేంజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అటవీ ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
అటవీ అమరుల దినోత్సవంలో అధికారులు


