వినాయక నిమజ్జనంపై
భక్తుల్లో ఆందోళన
వర్షాభావంతో ఒట్టిపోయిన మున్నేరు
ధంసలాపురం పెద్ద చెరువే
ప్రత్యామ్నాయం
ఖమ్మం మయూరిసెంటర్: వినాయక చవితి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఖమ్మం వాసులు సిద్ధమయ్యారు. ఇళ్లలోనే కాక వీధులు, కూడళ్లలో లంబోదరుడి ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మూడో రోజు నుంచి నిమజ్జనాలు మొదలుకానుండగా.. ఈసారి ఎల్‌నినో పరిస్థితులతో భక్తుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. వర్షాభావ పరిస్థితులతో ఖమ్మం నగరాన్ని ఆనుకుని ప్రవహించే మున్నేరు వాగు పూర్తిగా ఒట్టిపోయింది. నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది పెద్ద విగ్రహాలను మున్నేరులోనే నిమజ్జనం చేసేవారు. కానీ ఇప్పుడు మున్నేరులో నీరు లేక నిమజ్జనం చేయడం అసాధ్యమేనని చెప్పాలి.
వెయ్యికి పైగా విగ్రహాలు
జిల్లా కేంద్రంలో ప్రతీ వీధిలో, కొన్ని చోట్ల రెండేసి గణనాథుల విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. గతేడాది 700 విగ్రహాలు ఏర్పాటుకాగా.. ఈసారి ఆ సంఖ్య వెయ్యి దాటొచ్చని ఉత్సవ సమితి బాధ్యులు, అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవికాక నగరానికి సమీప గ్రామాల నుంచి మరో 200 విగ్రహాలను నిమజ్జనం కోసం ఖమ్మంకే తీసుకొస్తారు. ఇవన్నీ నిమజ్జనం చేసేలా మున్నేటిలో నీరు లేకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు.
అన్నీ అటే...
మున్నేటిలో నీరు లేకపోవడంతో ఖమ్మం కార్పొరేషన్, పోలీసు అధికారులు విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాలు పరిశీలించే క్రమాన ధంసలాపురం చెరువు కనిపించింది. గతేడాది 700 విగ్రహాలను ఏర్పాటుచేస్తే మున్నేరు పరీవాహక ప్రాంతమైన కాల్వొడ్డు, ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిలతో పాటు ధంసలాపురం చెరువులో నిమజ్జనం చేయించారు. ఇందుకోసం 20కి క్రేన్లు వినియోగించారు. ఈసారి విగ్రహాల సంఖ్య వెయ్యి దాటనుండగా అన్నింటినీ ధంసలాపురం చెరువులో నిమజ్జనం చేయించడం అధికారులకు సవాల్‌గా మారనుంది. కానీ ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో ధంసలాపురం చెరువు వద్ద 16 క్రేన్ల ఏర్పాటుకు అధికారులు టెండర్లు ఆహ్వానించారు.
తాత్కాలిక నీటి గుంతల ఏర్పాటుతో...
ఒకే చెరువు వద్దకు పెద్దసంఖ్యలో విగ్రహాలు తీసుకురానుండడంతో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్యలు తలెత్తనుంది. అంతేకాక నిమజ్జనం కూడా గంటల తరబడి సాగే అవకాశముంది. వందలాది విగ్రహాల వెంట భక్తులు, నిర్వాహకులతో పాటు నిమజ్జనాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు చెరువు వద్దకు వస్తారు. ఈక్రమాన ట్రాఫిక్‌ను నియంత్రించడం, ఇతర ఏర్పాట్లు చేయడంపై అధికారులు దృష్టి సారించారు. అయితే, నగర నలు మూలల తాత్కాలిక నీటి గుంతలు (ఆర్టిఫీషియల్ పాండ్స్) ఏర్పాటు చేస్తే చిన్న విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశమున్నందున ఆ దిశగా అధికారులు దృష్టి సారించాలనే వినతులు వస్తున్నాయి.


