ఖమ్మంరూరల్: బాలికలు వ్యక్తిగత శుభ్రత పాటించడం కీలకమని డిప్యూటీ కలెక్టర్ అపూర్వ, జిల్లా సంక్షేమ అధికారి ఏ.ప్రమీల సూచించారు. ‘బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లిలోని టీజీఎస్‌జేసీజీలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్, డీడబ్ల్యూఓ మాట్లాడుతూ విద్యార్థినులకు రుతుస్రావ సమయాన వ్యక్తిగత పరిశుభ్రత పాటించడమే కాక శానిటరీ ప్యాడ్ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అలాగే, పోషకాహారం తీసుకుంటే రక్తహీనత నుంచి బయటపడొచ్చని చెప్పారు. ఈ విషయమై బాలికల్లో అవగాహన పెంచేలా ఉపాధ్యాయినులు కూడా కృషి చేయాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీలత, మెడికల్ ఆఫీసర్ కనకదుర్గ, అధ్యాపకులు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.


