నేలకొండపల్లి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కె.రాజశేఖర్‌గౌడ్ తెలిపారు. నేలకొండపల్లి ఆస్పత్రిని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన రోజువారీ ఓపీ, మందుల లభ్యతపై ఆరా తీశారు. అనంతరం చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి సేవలు తెలుసుకున్నారు. ఆతర్వాత డీసీహెచ్‌ఎస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందేలా సౌకర్యాలు సమకూరుస్తున్నందున వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో మందుల కోసం రూ.1.80 లక్షలు కేటాయించగా, నేలకొండపల్లి సీహెచ్‌సీని 50 పడకలకు అప్‌గ్రేడ్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంగళ, డాక్టర్ కె.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


