పెద్దాస్పత్రిలో సేవల విస్తరణ | - | Sakshi
Sakshi News home page

పెద్దాస్పత్రిలో సేవల విస్తరణ

Sep 12 2026 12:06 AM | Updated on Sep 12 2026 12:06 AM

రికార్డు స్థాయిలో

అల్ట్రాసౌండ్‌ స్కాన్లు

కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో

ఆధునిక వైద్యసేవలు

ఈ ఏడాది ఇప్పటివరకు

ఎంసీహెచ్‌హెచ్‌లో 16,961 స్కాన్లు

త్వరలోనే అందుబాటులోకి

రానున్న ఎంఆర్‌ఐ

ఖమ్మం వైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రి అంటే సాధారణ వైద్యమే అందుతున్న భావనను తొలగించేలా ఖమ్మం జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో వైద్య సేవలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఆధునిక వైద్య పరీక్షలు, అధునాతన స్కానింగ్‌ సదుపాయాలు, రేడియాలజీ సేవలు, మాతా శిశు సంరక్షణ సేవలతో నాణ్యమైన వైద్యం అందుతుండగా, ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన భారం తగ్గుతోంది. ప్రభుత్వ వైద్య సేవలను బలోపేతం చేసేలా కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యాన మెరుగైన ఫలితాలు వస్తున్నాయి.

పోర్టబుల్‌ అల్ట్రాసౌండ్‌ యంత్రాలు

జనరల్‌ ఆస్పత్రిలో కొత్తగా మూడు పోర్టబుల్‌ అల్ట్రాసౌండ్‌ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో పరీక్షలు అవసరమైన వారిని ఒక విభాగం నుంచి మరో విభాగానికి తీసుకెళ్లే అవసరం లేదకుండా ఉన్న ప్రదేశంలోనే అల్ట్రాసౌండ్‌ పరీక్షలు నిర్వహించే అవకాశం ఏర్పడింది. అలాగే, త్వరలో ఎంఆర్‌ఐ యంత్రం అందుబాటులోకి రానుంది. కలెక్టర్‌ చొరవతో ఇందుకు అవసరమైన పనులు జరుగుతుండగా, ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుపై దృష్టి సారించారు. మెదడు, వెన్నెముక, కీళ్లు, కండరాలు, అంతర్గత అవయవాలు, తదితర ప్రాంతాలకు సంబంధించి సమస్యలను గుర్తించేందుకు ఎంఆర్‌ఐ పరీక్ష ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ సేవ అందుబాటులోకి వస్తే ప్రజలపై ఆర్థికభారం తగ్గుతుంది.

ఖాళీల భర్తీకి చర్యలు

ఆస్పత్రిలో చికిత్స కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల నుంచి వస్తుంటారు. ఈమేరకు సరిపడా వైద్యులు, సిబ్బంది నియామకంపైనా కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని సూచించారు. వైద్య పరికరాలను సమకూర్చడంతో పాటు సరిపడా వైద్య నిపుణులను నియమిస్తే ఆస్పత్రిలో సేవలు ఇంకా మెరుగుపడనున్నాయి.

పెద్దాస్పత్రిలో అల్ట్రాసౌండ్‌ సేవలను జనం వినియోగించుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఈఎన్‌టీ, ఆర్థో తదితర విభాగాలకు వచ్చే వారి అవసరాల ఆధారంగా 13,816 అల్ట్రాసౌండ్‌ స్కాన్లు చేశారు. జూలైలో 1,977, ఆగస్టులో 1,943 స్కాన్లు జరిగాయి. ఇక మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో జనవరి నుంచి ఆగస్టు వరకు మొత్తం 16,961 స్కానింగ్‌లు నిర్వహించారు. ఇందులో 8,945 ఓబీజీ స్కాన్లు, 5,417 ఉదర భాగం స్కాన్లు, 546 టిఫ్ఫా స్కాన్లు ఉండగా.. చిన్నారులు 2,053 మందికి స్కానింగ్‌ చేశారు. నెలల వారీగా పరిశీలిస్తే ఓబీజీ స్కాన్లు జనవరిలో 910 నిర్వహిస్తే, ఆగస్టులో 1,329 చేశారు. టిఫ్ఫా స్కాన్లు సైతం ఫిబ్రవరిలో 19గా నమోదైతే ఆగస్టులో 136కు చేరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement