ఖమ్మం సహకారనగర్: దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాలు అందజేసేందుకు ఖమ్మం నయాబజార్‌లోని భవిత కేంద్రంలో శుక్రవారం పరీక్షలు నిర్వహించారు. అలింకో, సమగ్ర శిక్ష, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ శిబిరంలో ఖమ్మం అర్బన్‌తోపాటు 11 మండలాల విద్యార్థులు హాజరయ్యారు. వీరికి వైద్యులు పరీక్షలు నిర్వహించాక వీల్‌చైర్లు, త్రిచక్ర వాహనాలు, వినికిడి యంత్రాలు, బ్రెయిలీ కిట్లు, వైట్ కేన్లు తదితర ఉపకరణాలు అవసరమైన వారిని గుర్తించారు. జిల్లాలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న శిబిరాలకు 514 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి బాజోజు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శైలజాలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు, ఐఈఆర్‌పీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఫిజియోథెరపిస్టులు పాల్గొన్నారు.
పుచ్చ పంట ధ్వంసం
పెనుబల్లి: పెనుబల్లి మండలం తాళ్లపెంట గ్రామంలో కౌలు రైతు మాయర సూర్యనారాయణకు చెందిన పుచ్చ పంటను గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గ్రామంలోని కళ్యాణం నాగేశ్వరావుకు చెందిన రెండెకరాలు భూమిని సూర్యనారాయణ కౌలుకు తీసుకుని పుచ్చ పంట సాగు చేస్తున్నాడు. ఈమేరకు పంటను ధ్వంసం చేయగా, బాధితులు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వీఎం.బంజరు ఎస్‌ఐ ఎస్.కే.షాకీర్ తెలిపారు.


