సాగుకు 12 గంటలు అందని సరఫరా
ఎల్‌సీలు, నిర్వహణ పేరుతో
ఎడాపెడా కటింగ్
పంట చేతికి వచ్చేదెలా అని
అన్నదాతల ఆవేదన
పంట చేతికి వచ్చేనా..
12 గంటలు సరఫరా చేస్తున్నాం..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎల్‌నినో రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. ఓ పక్క వర్షాభావం, మరోపక్క మండుతున్న ఎండలతో పంటలు వడబడుతున్నాయి. ఈనేపథ్యాన బోర్లు, బావులను నమ్ముకుని వరి సాగు చేసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎల్‌సీ(లోకల్ కటింగ్), సబ్‌స్టేషన్ల నిర్వహణ పేరుతో సరఫరా చేసే 12 గంటల్లో కూడా ఎడాపెడా విద్యుత్ కోత విధిస్తుండడంతో పంటకు నీరందించలేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
కరెంట్‌నే నమ్ముకుని సాగు..
ఈ సీజన్‌లో జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేయలేదు. దీంతో ఆయకట్టు చాలా వరకు బీడుగా వదిలేశారు. ఇంకొన్ని చోట్ల బోర్లు, బావుల నీరు.. సత్తుపల్లి, వైరా, మధిర ప్రాంతాల్లో గోదావరి జలాల ఆధారంగా 1,65,725 ఎకరాల్లో వరి సాగైంది. జిల్లాలో 1.18 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండగా.. వీటి పరిధిలో సుమారు 70వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. అయితే, 12గంటల పాటు కోతలు లేకుండా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అయితేనే పైరుకు నీరందించే అవకాశముంది. కానీ తరచూ కోతలతో కలుపు పెరుగుతుండగా, పంట కూడా వడబడుతోంది.
రోజు 5 – 7 గంటల కోత
నిరంతరాయంగా 12గంటల పాటు విద్యుత్ సరఫరా ఉంటేనే వరికి నీరు అందించే అవకాశం ఏర్పడుతుంది. కానీ లోకల్ కటింగ్‌తో మూడేసి గంటలు, సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ పేరుతో రెండు గంటల చొప్పున కోత విధిస్తున్నారు. ఇదికాక వారానికోసారి సబ్ స్టేషన్ నిర్వహణ పేరుతో ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ తీస్తున్నారని రైతులు వాపోతున్నారు. రోజుకు ఐదు గంటలు, వారంలో ఓ రోజు అదనంగా మరో రెండు గంటలు కోత విధిస్తుండడంతో పంటకు సరిపడా నీరు అందించలేకపోతున్నామని చెబుతున్నారు. కరెంట్ వచ్చి, పోతుండడంతో చివరి తడులకు నీరు అందక వడలిపోతోందని ఆవేదన చెందుతున్నారు.
పంటలు తీస్తూ..
వేంసూరు మండలంలో బోర్లు, బావుల కింద 18వేల ఎకరాల్లో వరి సాగైంది. అప్రకటిత కోతలతో ఈ మండలంలో వరి ఎండి నెర్రలు బారుతోంది. మండలంలోని వేంసూరు, భరిణిపాడు, కందుకూరు, దుద్దిపుడి, లింగపాలెం, వెంకటాపురం, చౌడవరం, అమ్మపాలెం, రాయుడుపాలెంల్లో బోర్లు, బావుల కింద సాగు చేసిన వరి పంట ఎండిపోయే స్థితికి చేరింది. దీంతో కొందరు రైతులు ఎండిన పంట తొలగిస్తూ తక్కువ నీటి అవసరం ఉంటుందని జొన్న సాగుకు మళ్లారు.
కరెంట్ కోతలతో
ఎండుతున్న పైర్లు
బోర్ల ఆధారంగా పదెకరాల్లో వరి వేశా. ఉదయం 6నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ సరఫరా అని చెబుతున్నా గంటల కొద్దీ కోత విధిస్తున్నారు. విద్యుత్ కోతతో నీరు అందించలేకపోతున్నాం. మరోపక్క ఎండతో వరి చేతికి రావడం కష్టమే.
– మందపాటి మహేశ్వర్‌రెడ్డి, భరణిపాడు,
వేంసూరు మండలం
రైతులకు అనుకూలంగా ఉదయం 6–30నుంచి సాయంత్రం 6–30 గంటల వరకు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. పీక్ అవర్స్‌లో ఓవర్ లోడ్‌తో ఎక్కడైనా ఇబ్బంది ఉంటేనే సరఫరా చేయడం లేదు. మిగతా అంతా సక్రమంగా సరఫరా చేస్తున్నాం. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి,
ఎస్‌ఈ, విద్యుత్ శాఖ, ఖమ్మం సర్కిల్


