ఖమ్మం సహకారనగర్: విద్యా ప్రమాణాలు, విద్యార్థుల నమోదు, విద్యాపరమైన ప్రగతితోపాటు విద్యాశాఖ కార్యక్రమాల అమలులో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన నిలిపేందుకు కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మదన్‌మోహన్ సూచించారు. డీఈఓ జి.సదానందం అధ్యక్షతన గురువారం జరిగిన పీఎంశ్రీ పాఠశాలల హెచ్‌ఎంలు, ఎంఈఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ మండలంలోని పీఎంశ్రీ పాఠశాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా నిధులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు, హాజరులో ప్రగతి సాధించడమే కాక ర్యాంకింగ్‌లో జిల్లాకు మెరుగైన స్థానం సాధించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. అత్యుత్తమ పనితీరు కనబరిచే అధికారులు, ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తామని, అవసరమైతే విదేశాల్లో అధ్యయనానికి ఎంపిక చేస్తామని జేడీ తెలిపారు. ఈ సమావేశంలో సెక్టోరియల్ అధికారులు, ఎఫ్‌ఏఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
●ఏన్కూరు: ఏన్కూరులోని గురుకుల విద్యాలయాన్ని విద్యాశాఖ జేడీ మదన్‌మోహన్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, రికార్డులను, పీఎంశ్రీ పథకం ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. అంతేకాక అటల్ టింకరింగ్, ల్యాబ్‌ను పరిశీలించి గత ఏడాది ఇంటర్, పదో తరగతి ఫలితాలు తెలుసుకుని బోధనపై అధ్యాపకులకు సూచనలు చేశారు. ప్రిన్సిపాల్ వేము రాజు, ఉద్యోగులు మాధవరావు, శాంసన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
విద్యాశాఖ జేడీ మదన్‌మోహన్


