● రైతుల సమక్షాన పారదర్శకంగా హద్దుల నిర్ధారణ ● రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ దివాకర
మధిర/ఎర్రుపాలెం/బోనకల్: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే ద్వారా రైతులెవరికీ అన్యాయం జరగకుండా వివాదాలు, విస్తీర్ణం వ్యత్యాసాలు, రికార్డుల్లోని లోపాలను సరిచేస్తామని కలెక్టర్ దివాకర టీ.ఎస్. వెల్లడించారు. మధిర మండలం తొండలగోపవరం, ఎర్రుపాలెం మండలం రాజుపాలెం రెవెన్యూ పరిధి వెంకటాపురం, రాజుపాలెం గ్రామాలతో పాటు బోనకల్ మండలం బ్రాహ్మణపల్లిలో భూముల రీసర్వేను ఆయన గురువారం పరిశీలించారు. తొండలగోపవరంలో పొలాల్లో గట్ల వెంట నడిచి వెళ్లిన ఆయన రీసర్వేను పరిశీలించి రైతుల అభిప్రాయాలు తెలుసుకొని వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మనిషికి ఆధార్ మాదిరి సాంకేతిక పరిజ్ఞానంతో చేస్తున్న భూసర్వే ద్వారా ప్రతీ రైతు భూమికి డిజిటల్ మ్యాప్‌తో కూడిన భూధార్ కార్డు అందుతుందని తెలిపారు. ప్రతీ రైతుకు ముందుగా నోటీసులు జారీ చేసి వారి సమక్షానే సర్వే చేసి హద్దులు నిర్ధారించడంతో భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలు రావని చెప్పారు. ఈమేరకు రైతులు పట్టా పాస్‌బుక్, ఇతర వివరాలతో అధికారులకు సహకరించాలని సూచించారు. సర్వే అనంతరం భూ వివరాలను ప్రకటించి, అభ్యంతరాలు స్వీకరించాక భూధార్ కార్డులు జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆర్‌డీఓ ఎన్.శ్రీనివాస్, తహసీల్దార్లు రాళ్లబండి రాంబాబు, కె.సునీత ఎలిజబెత్, సర్పంచ్ బొగ్గుల గోవర్దన్‌రెడ్డి, ఉద్యోగులు రవికుమార్, శిరీష, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పోషణ సేవలను బలోపేతం చేయాలి
ఖమ్మంమయూరిసెంటర్: వచ్చే నెల 8వ తేదీ వరకు జరిగే జాతీయ పోషణ మాసం కార్యక్రమాల్లో ప్రతీఒక్కరు బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. మహిళా, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యాన రూపొందించిన పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కచి మాట్లాడారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు, మహిళలకు మెరుగైన పోషకాహారం అందించడంతో పాటు పోషణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జాతీయ పోషణ మాసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్యోగులకు సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి ఏ.ప్రమీల, డీఎంహెచ్‌ఓ రామారావు, డీపీఓ వినోద్‌కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


